
నవీపేట్, వెలుగు: మండల కేంద్రంలో పెట్రోల్ బంక్‌లో పనిచేసే వ్యక్తికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ. 70 వేలు కాజేశారు. ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ నగర్ కు చెందిన వెంకటేశ్ అయ్యప్ప టెంపుల్ వద్ద నున్న పెట్రోల్ బంక్ లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల1 సాయంత్రం 7 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రూ. 3,370 డీజిల్ కొట్టించుకోని ఫోన్ పే చేశాడన్నారు. వెంటనే బంక్ యజమాని రాంసింగ్‌కు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపగా ఫెయిల్ అని వచ్చింది.
అదే రోజు ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేయగా మీ డబ్బులు అకౌంట్లోకి రావడానికి ఒక్కరోజు పడతాయని సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటికే ఎస్బీఐ బ్యాంక్ అధికారులమని వాట్సాప్ కాల్ చేసి వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ఓకే చేయండి అని చెప్పారన్నారు. దీంతో ఓకే కొట్టగా.. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.