- నాలుగు గంటల పాటు నిలిచిన విద్యుత్ సరఫరా
- క్యాబిన్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్
- మంటలార్పడానికి 16 గంటల పాటు శ్రమించిన సిబ్బంది
- జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘటన
మెట్ పల్లి, వెలుగు : ఘట్ కేసర్ నుంచి మల్లాపూర్ మండలం రాఘవపేటకు పెట్రోల్, డీజిల్ తీసుకొస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తాపడి పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టింది. మంటలు చెలరేగడం, పక్కనే పెట్రోల్బంక్ఉండడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హైరానా పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఓ ఆయిల్ ట్యాంకర్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ డిపో నుంచి 18 వేల లీటర్ల డీజిల్, 4 వేల లీటర్ల పెట్రోల్ లోడుతో మల్లాపూర్ మండలం రాఘవపేట శ్రీ రాజరాజేశ్వర ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్తోంది. నేషనల్ హైవే 63పై మెట్ పల్లి శివారులోని వెంకట్రావుపేట హెచ్ పీ పెట్రోల్ పంపు సమీపంలోకి రాగానే ట్యాంకర్ ముందు భాగంలోని టైరు పేలింది.
అదుపుతప్పి బోల్తాపడి రోడ్డు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో టౌన్ 2 పరిధిలో కరెంట్ సప్లై నిలిచిపోయింది. ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగడంతో డ్రైవర్ క్యాబిన్ నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. పెద్ద శబ్దం రావడంతో పాటు మంటలు వస్తుండడంతో వాకింగ్‌కు వెళ్తున్న వారు డయల్100కు, ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. దీంతో రెండు ఫైరింజన్లను తీసుకువచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పక్కనే పెట్రోల్బంక్ఉండడంతో మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ట్యాంకర్ నిండుగా డీజిల్, పెట్రోల్ ఉండడంతో మంటలను అదుపులోకి తేవడానికి ఫైర్ఆఫీసర్లు, సిబ్బంది ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. 16 గంటల పాటు రెండు ఫైరింజన్లు, 16 ఫోమ్ క్యాన్లతో నిరంతరాయంగా పని చేసి మంటలను అదుపులోకి తేగలిగారు. కాలిపోయిన ట్యాంకర్ తప్ప ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. సాయంత్రం కొన్ని వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. డీఎస్పీ రవీంద్ర రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ మురళీ మనోహర్ రెడ్డి, భానుప్రసాద్, ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్, ఎస్సైలు చిరంజీవి, నవీన్ కుమార్ పర్యవేక్షించారు.