ఇష్టంతో పెంచాలి..ఇష్టమొచ్చినట్లు కాదు

జాలి గుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా… అని ఒక తెలుగు సినిమాలో పాటుంది. చేసిన మేలు మర్చిపోవనో… ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని  అమాయక ప్రాణులనో… మనుషులకు మొదటి నుంచీ మూగజీవాలను పెంచుకునే అలవాటు ఉంది.  ఇప్పుడీ కల్చర్​ అర్బన్​ ఇండియాలో బాగా పెరుగుతోంది. అయితే… పెట్​ కల్చర్​కికూడా కొన్ని రూల్స్​, రెగ్యులేషన్లు ఉన్నాయి. ఇండియాలో వాటిని పెద్దగా పట్టించుకోరు.

మూగ జీవులంటే మాట రాని జీవులే గానీ, కొంతమంది మనుషుల మాదిరిగా మనసులేనివి మాత్రం కావు. ప్రాణానికి ప్రాణమివ్వటమే తప్ప పగలూ ప్రతీకారాలు ఎరగని పరమాత్ముని ప్రతిరూపాలవి. నమ్మకానికి అమ్మ వంటివన్నా అతిశయోక్తి కాదు. సాటివాణ్ని చేరదీయటానికి భయపడే మనిషి… కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు, చేపలు, గినియా పందులు తదితర నోరు లేని జీవులను పెంచుతున్నాడు. పేరు పెట్టి మరీ ప్రేమగా పిలుచుకుంటున్నాడు.

పెరుగుతున్న​ పెట్​ పాపులేషన్​, బిజినెస్

పెంపుడు కుక్కలు ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అమెరికాలో ఎక్కువ. 2018 సర్వే ప్రకారం ఆ దేశంలో వాటి పాపులేషన్​ 9 కోట్లని అంచనా. పర్​ కేపిటా ప్రకారం చూస్తే పెట్​ యానిమల్స్​ సంఖ్య ఇజ్రాయెల్​, టెల్​ అవివ్​లలోనే అత్యధికం. టెల్​ అవివ్​లో డాగ్​–ఫ్రెండ్లీ బీచ్​లు 4, పార్క్​లు 70 వరకు లేదా స్క్వేర్​ కిలో మీటర్​కి ఒకటి చొప్పున ఉన్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​తోపాటు యూరోపియన్​ దేశాల్లో పెంపుడు జంతువుల రక్షణ కోసం చెప్పుకోదగ్గ సర్కారు పాలసీలు అమల్లో ఉన్నాయి.

అమెరికాలో పప్పీ  డాగ్​ రేటు రూపాయల్లో సుమారు 95 వేలు కాగా, మీడియం డాగ్​ ఖరీదు లక్షా 13 వేలు.  పెద్ద  కుక్క ఖరీదు రూ. లక్షా 32 వేలు పైమాటే. 2016 లెక్కల్ని బట్టి మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పెంచుకుంటున్న జంతువుల జనాభా కోటిన్నరకుపైనే అంటున్నారు. పెట్​ యానిమల్స్​ పాపులేషన్​ పెరుగుతుండటంతో ఫుడ్​, హెల్త్​ ప్రొడక్ట్స్​, యాక్సెసరీస్​కీ డిమాండ్​ నెలకొంది. ఫుడ్​ మార్కెట్​ మూడేళ్ల కిందటి(రూ.1,346 కోట్ల)తో పోల్చితే ఇప్పుడు రూ.2,110 కోట్లకు చేరింది.

వివిధ దేశాల్లోని రూల్స్​, రెగ్యులేషన్స్​

ఇంగ్లండ్​లోని లీడ్​ సిటీ గవర్నమెంట్ అగ్రిమెంట్​ ప్రకారం పెంపుడు కుక్కలకు మైక్రోచిప్​లను తప్పనిసరిగా అమర్చాలి. ఈ రూల్​ 2016 నుంచే ఉంది. వ్యక్తులైనా, సంస్థలైనా రెండు కుక్కల్ని లేదా రెండు పిల్లుల్ని మించి పెంచుకోవటానికి వీల్లేదు. లండన్​లో పెట్​ పాలసీని 2017లో రూపొందించారు. దీని ప్రకారం పెంపుడు కుక్కలకు లైసెన్స్​ చేయించాలి. మూడు కన్నా ఎక్కువ డాగ్​లను దత్తత తీసుకోవటం కుదరదు. ఈ పాలసీని రెండేళ్లకోసారి లేటెస్ట్​ డేటా, కన్సల్టేషన్ల ఆధారంగా రివైజ్​ చేస్తారు.

అమెరికాలో పెట్​ ఓనర్​షిప్​ని చట్టప్రకారమే నిర్ణయిస్తారు. ఈ విషయంలో మునిసిపాలిటీ వంటి లోకల్​ బాడీలకే ఎక్కువ పవర్స్​ ఇచ్చారు. మన దేశంలో జంతువులను పెంచుకోవటానికి సంబంధించి చట్టంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 51ఏ, ప్రివెన్షన్​ ఆఫ్​ క్ర్యూయెల్టీ టు యానిమల్స్​ యాక్ట్​(పీసీఏ)–1960లోని చాప్టర్​–3, యానిమల్​ వెల్ఫేర్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా వంటివి కొన్ని రూల్స్​, రెగ్యులేషన్స్​ని​ అమలు చేస్తున్నాయి. వీటి ప్రకారం మూగజీవాల పట్ల జాలి, దయాగుణం లేకపోతే శిక్ష తప్పదు.   పీసీఏ చాప్టర్​–3 ప్రకారం పెట్​ ఓనర్లు తప్పు చేస్తే ఫైన్​ వేస్తారు. నేర తీవ్రతను బట్టి జైలుకికూడా పంపిస్తారు. పెంపుడు జంతువులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని యానిమల్​ బోర్డ్​ గైడ్​లైన్స్​ చెబుతున్నాయి.

కేఫ్​లు.. క్లబ్బులు.. హాస్టళ్లు..

మన దేశంలో పెట్​ కల్చర్​ పెరగడంతో చాలా సిటీల్లో ఇప్పటికే స్పెషల్ స్టార్టప్​లు మొదలయ్యాయి.

‘బార్క్​ ఎన్ ​బాండ్​’ యాప్​ రూపొందించారు. ఇది ప్రస్తుతానికి ముంబైలో పనిచేస్తోంది. వెటర్నరీ క్లీనిక్​లు, పెట్​–ఫ్రెండ్లీ కేఫ్​లు వంటివి తెలియజేస్తోంది.

కాలర్​ఫోక్​ డాట్​ కామ్’ వెబ్​సైట్… పెట్​ డాగ్​లకు కావాల్సిన గ్రూమింగ్​, బోర్డింగ్, ట్యాక్సీ సర్వీసులు కల్పిస్తోంది  ‘డాగ్గీ డబ్బాస్’ పెట్​ యానిమల్స్​కి​ హోమ్​ డెలివరీ ఫుడ్​ అందిస్తుంది.

‘పెట్​డోమ్’ యాప్​, ‘పెట్​డోమ్​’ వెబ్​సైట్​దత్తత​​ సేవలు అందిస్తాయి.

‘టైమ్​ ఫర్ ​పెట్​ డాట్​ కామ్’​ వెబ్​సైట్​ ద్వారా​ పెట్​ యానిమల్స్​ ఫుడ్​, యాక్సెసరీస్​, మెడికల్​ కేర్ పొందొచ్చు.

‘వ్యాగిల్’ ఆన్​లైన్​ కమ్యూనిటీ… జర్నీలు చేసే పెట్​ పేరెంట్స్​కి ఫ్రెండ్లీ ఇళ్లు చూసిపెడుతోంది.  ఇవేకాక ‘ప్యాక్​’,  ‘వివాల్డిస్’​లు ఉన్నాయి.