క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ

కరోనా నివారణకు ఫైజర్ -బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. క్రిస్మస్ కు ముందే ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఫైజర్ భావిస్తోంది. వ్యాక్సిన్ 95 శాతం విజయవంతం అవుతోందని ప్రయోగాల్లో తేలినట్లు ఫైజర్ -బయోఎన్‌టెక్‌ సంస్థలు తెలిపాయి. దీంతో యూఎస్, యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి అనుమతులు తీసుకుని ఈ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి పంపాలని భావిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తేలిన తర్వాత, వెంటనే అనుమతించాలని కోరుతూ యూఎస్ కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ను ఫైజర్ అభ్యర్థించనుంది. అంతా సక్రమంగా జరిగితే డిసెంబర్ రెండోవారంలో అనుమతులు రావచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. క్రిస్మస్ కు ముందే టీకా పంపిణీ ప్రారంభిస్తామని చెప్పింది.

ఈ వ్యాక్సిన్ ను అన్ని రకాల వయసుల వారికీ ఇచ్చి పరీక్షించగా, చెప్పుకోతగ్గ దుష్ప్రభావాలు నమోదు కాలేదని తెలిపింది ఫైజర్. వయో వృద్ధులకు, 14 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలోనూ సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని సంస్థ వర్గాలు ప్రకటించాయి.

ఈ ఏడాది చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు రెడీ చేస్తామని ఫైజర్ తెలిపింది. దీంతో 2.5 కోట్ల మందిని కరోనా నుంచి రక్షించుకోవచ్చని  చెప్పింది. అంతేకాదు 2021 నాటికి 13 కోట్ల డోసులు తయారు చేస్తామని ప్రకటించింది.