లోకల్‌గా చదివినోళ్లకు ఎస్ఆర్లుగా అవకాశం
ఇతర రాష్ట్రాల్లో చదివినోళ్లకు నో చాన్స్
కనీసం పీజీ రిజిస్టర్ చేయాలని విజ్ఞప్తి
కుదరదంటున్న మెడికల్ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా డాక్టర్ల పీజీ రిజిస్ట్రేషన్లను సర్కార్ ఆపేసింది. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి సుమారు 11 వందల మంది డాక్టర్ల పీజీ పూర్తయినప్పటికీ, మెడికల్ కౌన్సిల్‌లో వీరి పీజీని రిజిస్టర్ చేయలేదు. కరోనా కారణంగా వీరిని ప్రభుత్వ దవాఖానల్లో కంపల్సరీగా పనిచేయాల్సిందేనని సర్కార్ ఆదేశించింది. సీనియర్ రెసిడెంట్స్‌గా గుర్తిస్తూ వేతనం, ఇన్సెంటివ్ ఇస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ చేసిన వారికి, వివిధ ప్రభుత్వ దవాఖాన్లలో సీనియర్ రెసిడెంట్లుగా పోస్టింగ్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో, ఎయిమ్స్, జిప్‌మర్ వంటి సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్‌లో పీజీ పూర్తి చేసి వచ్చినవారిని మాత్రం తీసుకోలేదు. అయితే వీళ్ల పీజీ రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారు. దీనిపై వీళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీజీ రిజిస్ట్రేషన్ చేయకుండా, రెసిడెంట్లుగా అవకాశం కూడా ఇవ్వకుంటే తాము నష్టపోతామంటున్నారు. ఇక్కడ చదివిన వారి పీజీ రిజిస్ట్రేషన్ చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారి పీజీ రిజిస్టర్ చేస్తే.. సీనియారిటీలో తేడాలొస్తాయని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పీజీలు రిజిస్ట్రేషన్ చేయడం లేదని చెబుతున్నారు. అయితే, సూపర్ స్పెషాలిటీ సీట్లు వచ్చిన వారికి మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెబుతున్నారు.
ప్రయోజనం ఏంది?
పీజీలు రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో తాము ఉద్యోగవకాశాలను కోల్పోతున్నామని ఇతర రాష్ట్రాల్లో చదివిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రైవేట్‌లో పనిచేయడానికి వెళ్తే పీజీ రిజిస్ట్రేషన్ అడుగుతున్నారని లేదంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు ఇచ్చిన శాలరీనే ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్లు కష్టపడి స్పెషలైజేషన్ చేసి ప్రయోజనం ఏంటని అడుగుతున్నా రు. రిజిస్ట్రేషన్లు చేయొద్దని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని, అందుకే రిజిస్ట్రేషన్ చేయడం లేదని మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్లు చెప్పారు.
For More News..