సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలి .. ఓయూలో పీజీ విద్యార్థుల ఆందోళన

సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలి .. ఓయూలో పీజీ విద్యార్థుల ఆందోళన

ఓయూ, వెలుగు: సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి బుధవారం వారు రాస్తారోకోకు దిగారు. 75 శాతం హాజరు లేదని పరీక్షా ఫీజు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరీక్షా ఫీజు స్వీకరించి, పరీక్షలు రాసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశిం తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. 

వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తమకు 75 శాతం హాజరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పరీక్షా ఫీజును స్వీకరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.