గ్రేటర్ శివార్లో రెచ్చిపోతున్న కెమికల్ డంపింగ్ మాఫియా

గ్రేటర్ శివార్లో రెచ్చిపోతున్న కెమికల్ డంపింగ్ మాఫియా
  • రెచ్చిపోతున్న కెమికల్  డంపింగ్​ మాఫియా

గ్రేటర్​ శివారుల్లోని ఫార్మా కంపెనీలు ప్రజలపై విషం చిమ్ముతున్నాయి. అర్ధరాత్రి దొంగచాటున ఇష్టానుసారం నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకర రసాయన వ్యర్థాలు పారోబోస్తున్నాయి. అడ్డువచ్చిన వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడని మాఫియాను ఇందుకోసం ఎంచుకుంటున్నాయి. ఈ మాఫియా డబ్బులకు కక్కుర్తి పడి ప్రమాదక కెమికల్స్​ను గుట్టుచప్పుడు కాకుండా పోరబోస్తోంది.


జీడిమెట్ల, వెలుగు : హైదరాబాద్​లో కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పాలకులు చెబుతున్నా ఫలితం మాత్రం కన్పించడంలేదు. ప్రస్తుతం ఉన్న బృందాలు అన్ని పారిశ్రామికవాడలకు సరిపోయే విధంగా లేవు. ప్రజలు  ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు తామంతట తాముగా ట్యాంకర్లను పట్టుకున్న దాఖలలూ అరుదు. దీంతో పొల్యూషన్ ​కంట్రోల్ ​బోర్డు(పీసీబీ) నిర్లక్ష్యం, నిఘా లేకపోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అది సాకు మాత్రమే..

ట్రీట్మెంట్​ఖర్చు ఎక్కువ కావడం వల్లే ఫార్మా కంపెనీలు వ్యర్థాలను బయట పారబోస్తున్నయనేది కేవలం ఒక సాకు మాత్రమే. చాలా కంపెనీలు అనుమతులు పొందిన ప్రొడక్టన్​ కాకుండా ఇతర వాటిని తయారు చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. వాటి ఎప్ల్యూయెంట్​ను ట్రీట్మెంట్​ ప్లాంట్​లకు పంపితే చేసిన ప్రొడక్ట్​ ఏంటో  తెలిసి గుట్టురట్టవుతుంది. అలాగే అనుమతులు పొందిన ప్రొడక్టులను మోతాదుకు మించి తయారు చేస్తే తెలిసిపోతుంది. అందుకే కెమికల్​ మాఫియాను కంపెనీలు పెంచి పోషిస్తున్నాయి. 

సులభంగా తెలుసుకోవచ్చు, కానీ..!

అక్రమ వ్యర్థ రసాయనాలు తరలిస్తున్న ట్యాంకర్లను పట్టుకున్నప్పుడు అది ఏ కంపెనీదో అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. కానీ, చాలా సందర్భాల్లో ట్యాంకర్ యజమానులపైనే కేసులు నమోదు చేస్తున్నారు తప్పితే కంపెనీల జోలికి పోవడం లేదు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన సందర్భాల్లో పకడ్బందీగా విచారణ చేసి కంపెనీలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో లోపయకారి ఒప్పందంలో భాగంగా కంపెనీలను వదిలేస్తేన్నారే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. పోలీసులు, పీసీబీ గట్టిగా విచారణ జరిపి కంపెనీలను గుర్తించి చర్యలు తీసుకుంటే డంపింగ్​ మాఫియాకు అడ్డుకట్టపడుతుందని ప్రజలు చెబుతున్నారు.

జీడిమెట్ల ఇండస్ట్రియల్ ​ఏరియాలోని నాలాల్లో ట్రాంకర్​తో వచ్చి ప్రమాదకర రసాయన వ్యర్థాలను పారబోస్తున్నారన్న సమాచారంతో పీసీబీ అధికారుల అక్కడికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వచ్చిన కెమికల్ మాఫియా సభ్యులు అధికారిని కొట్టి ట్యాంకర్​ను తీసుకుని పారిపోయారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా అది ఏ కంపెనీ నుంచి వచ్చిందో అధికారులు పసిగట్టలేదు. 

జులై నెలలో దుండిగల్​లో  అక్రమంగా కెమికల్​ వేస్ట్​ తీసుకెళ్తున్న ట్యాంకర్​ ఇంజిన్​లోపంతో రోడ్డుపై ఆగిపోయింది. అదే సమయంలో పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా, వ్యర్థాలను పారబోయడానికి తీసుకెళ్తున్నారనే విషయం బయటపడింది.  ఆ ట్యాంకర్​ను జేఈటీఎల్​కు తరలించారు. 

బతుకుడే కష్టమైంది

ఫార్మా కంపెనీల ఆగడాలతో అల్లాడిపోతున్నాం. గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైంది. కిటీకీలు తెరిస్తే కెమికల్​ వాసన. బోర్లు వేస్తే కెమికల్​ నీరు. ఇక్కడే బతుకుడే కష్టమైంది. అనేక అడ్డదారుల్లో కెమికల్​పారబోస్తున్నారు. దీంతో విచిత్రమైన రోగాల భారిన పడుతున్నాం. కఠినమైన శిక్షలు, భారీగా ఫైన్​లు వేస్తేగానీ వీరి ఆగడాలు ఆగవు. పీసీబీ అధికారులు కనీసం మానవతా ధృక్పథంతోనైనా తమ విధులు సక్రమంగా చేయాలి. 

- రమణ, జీడిమెట్ల

చర్యలు తీసుకుంటున్నాం.

కాలుష్యకారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా రాత్రి పూట నిఘా బృందాలు ఏర్పాటు చేశాం. నిబంధనలు పాటించని కంపెనీలు మూసివేస్తున్నాం. ప్రజలు సైతం ఎలాంటి అనుమానం ఉన్నా తమకు ఫిర్యాదు చేయొచ్చు.  

– రాజేందర్​, మేడ్చల్​ జిల్లా పీసీబీ అధికారి