న్యూఢిల్లీ: ఉత్పత్తి పెంపు, ఎగుమతుల పెంపు ద్వారా దేశీయ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువ పరంగా 4-5 రెట్లు పెరిగి 200 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల పరిమాణాన్ని చేరుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఎగుమతుల విస్తరణపై దృష్టి సారించాలని అన్నారు.
ఇందుకు ఫార్మా పరిశ్రమ సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. "స్మార్ట్ మెడిసిన్ యుగం వస్తోంది. రాబోయే 20 నుంచి 30 సంవత్సరాలలో కొత్త చికిత్సలు, స్మార్ట్థెరపీలు అందుబాటులోకి వస్తాయి. మనం ఆ యుగానికి సిద్ధంగా ఉండాలి’’ అని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు.
పీఎల్ఐ సహా వివిధ విధాన కార్యక్రమాలతో పరిశ్రమకు ప్రభుత్వం సహాయం చేస్తోందని ఆయన అన్నారు. ఫార్మా పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకోవడంలో సహాయం చేయడానికి ప్రభుత్వం పరిశ్రమలతో, విద్యాసంస్థలతో కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.