
న్యూడిల్లీ: ఇండియా సహా చాలా దేశాల ఎగుమతులపై భారీగా సుంకాలు విధించిన కాసేపటికే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఫార్మా రంగంపై మునుపెన్నడూ లేనంతగా టారిఫ్‌లు వేస్తామని కుండబద్దలు కొట్టారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ "ఫార్మా సుంకాలు మీరు ఇంతకు ముందు చూడని స్థాయిలలో ఉంటాయి. ఫార్మాస్యూటికల్స్‌ను మేం ప్రత్యేక వర్గంగా చూస్తున్నాం. సమీప భవిష్యత్తులోనే సుంకాలను ప్రకటిస్తాం" అన్నారు.
ట్రంప్ ప్రభుత్వం గురువారం ఇండియా దిగుమతులపై 26 శాతం విధిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ఎగుమతులపై ఇండియా 52 శాతం టారిఫ్ వసూలు చేస్తోందని, తాము అందులో సగమే వేస్తున్నామని ట్రంప్చెప్పారు. ఇండియా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. అమెరికా మనదేశం నుంచి దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది.
ట్రంప్ తాజా ప్రకటనతో ఇండియా ఫార్మా కంపెనీలపై ఆర్థికభారం పెరిగే అవకాశం ఉంది. ధరలూ అధికమవుతాయి. అమ్మకాలు తగ్గవచ్చు. జెనరిక్ మెడిసిన్స్‌పై టారిఫ్‌లు వేయడం వల్ల అమెరికాకూ నష్టం వాటిల్లుతుందని నువామా ఇన్స్టిట్యూషనల్ఈక్విటీస్ ఎనలిస్టు అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఫార్మా కంపెనీల ఇబిటా 2–22 శాతం వరకు తగ్గవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
టారిఫ్ భయాలతో మార్కెట్లు కుదేల్
టారిఫ్ వార్ ముదురుతూనే ఉండటంతో ఈక్విటీ బెంచ్ మార్క్‌లు శుక్రవారం డీలాపడ్డాయి. మార్కెట్ హెవీవెయిట్ షేర్లయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టూబ్రో, ఇన్ఫోసిస్‌లలో భారీ అమ్మకాలు, మాంద్యం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావడంతో శుక్రవారం సెన్సెక్స్ 930.67 పాయింట్లు పడిపోయి 75,364.69 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో ఇది 1,054.81 పాయింట్లు క్షీణించి 75,240.55 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకుంది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 345.65 పాయింట్లు క్షీణించి 22,904.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 382.2 పాయింట్లు పెరిగి 22,867.90 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 2,820 స్టాక్‌లు క్షీణించగా, 1,126 లాభాలతో ముగిశాయి.
ఇన్వెస్టర్లకు రూ.9.98 లక్షల కోట్ల నష్టం
బీఎస్‌ఈ- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,98,379.46 కోట్లు తగ్గి రూ. 4,03,34,886.46 కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 3.08 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.43 శాతం క్షీణించింది. అన్ని సెక్టోరల్ఇండెక్స్లు నష్టాల్లోనే ముగిశాయి. ఆసియా మార్కెట్లలో, టోక్యో, సియోల్ నష్టపోయాయి. హాంకాంగ్, షాంఘై స్టాక్ మార్కెట్లు సెలవు కారణంగా పనిచేయలేదు.
యూరోపియన్ మార్కెట్లు మిడ్-సెషన్ ఒప్పందాలలో తక్కువగా ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 3.26 శాతం తగ్గి బ్యారెల్ ధర 67.85 డాలర్లకు చేరింది. ఎఫ్ఐఐలు గురువారం రూ.2,806 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, డీఐఐలు రూ.221.47 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు
చేశారు.
11 శాతం వరకు క్రాష్
ట్రంప్ ప్రకటన కారణంగా ఫార్మా షేర్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. టారిఫ్‌ల గురించి అమెరికా చేసిన ప్రకటనలో ఫార్మా సెక్టార్ లేకపోవడంతో ఈ షేర్లు గురువారం ఏడు శాతం వరకు లాభపడ్డాయి. ఈ సెక్టార్‌ను కూడా వదలబోని అమెరికా స్పష్టం చేయడంతో ఇవి శుక్రవారం 11 శాతం వరకు పడిపోయాయి. అరబిందో ఫార్మా షేరు 11 శాతం తగ్గి రూ.1,049.85కి, లారస్ ల్యాబ్స్ 9.5 శాతం తగ్గి రూ.561.55కి పడ్డాయి.
ఇప్కా ల్యాబ్స్ 9.3 శాతం తగ్గి రూ.1,357.80కి, లుపిన్ 8.41 శాతం తగ్గి రూ.1,918.20కి , బయోకాన్ 7.03 శాతం తగ్గి రూ.321.25కి దిగొచ్చాయి. సిప్లా 7 శాతం, మార్క్‌సాన్స్ ఫార్మా షేర్లు 6.7 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 6.5 శాతం, శిల్పా మెడికేర్ 6.4 శాతం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ 6.33 శాతం, గ్లాండ్ ఫార్మా షేరు 6 శాతం, అజంతా ఫార్మా 5.4 శాతం, వోకార్డ్ 5 శాతం తగ్గాయి. బీఎస్‌ఈ హెల్త్‌కేర్ ఇండెక్స్ 1,347.88 పాయింట్లు పడిపోయింది.