5లక్షల లంచం ఇవ్వడానికొచ్చి అరెస్ట్

రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌‌ జి.శ్రీనివాసరావును బ్లాక్ మెయిల్ చేస్తూ లంచం ఇచ్చేందుకు యత్నించిన ఫార్మాసిస్ట్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఏసీబీ డీజీ పూర్ణ చందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం బి.సత్యనారాయణ గౌడ్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపుర్ పీహెచ్‌‌సీలో ఫార్మసిస్ట్‌‌గా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేసే ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లను మెడికో సోషల్ వర్కర్ క్యాడర్‌‌లో నియమించేలా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకోసం హైదరాబాద్ లోని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌‌కు విషయం చెప్పాడు.

రెకమండ్ చేసిన ఇద్దరికి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా సంబంధిత ఆఫీసర్లకు చెప్పాలని కోరాడు. అందుకు గాను రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. ఈ ఫేవర్‌‌ చేయకపోతే తనపై దుష్ఫ్రచారం చేస్తానని బెదిరించారు. ఇదే విషయాన్ని ఫిబ్రవరి 20న ఏకంగా డైరెక్టర్ మొబైల్ నంబర్‌‌కు మెసేజ్ చేశాడు. దీంతో డైరెక్టర్ ఏసీబీకి సమాచారం అందించాడు. ఏసీబీ సూచనల ప్రకారం ఫార్మసిస్ట్ సత్యనారాయణను హైదరాబాద్‌‌లోని డైరెక్టర్ కార్యాలయనికి వచ్చేలా ప్లాన్ చేశారు. శుక్రవారం సాయంత్రం సత్యనారాయణను డైరెక్టర్‌‌ ఆఫీస్‌‌కు వచ్చి రూ.5లక్షలు లంచంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్‌‌ చేశారు. నగదు స్వాధీనం చేసుకొని నిందితుడిని ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు.