- 2023-24 లో విలువ సుమారు రూ.2.31 లక్షల కోట్లు
- వెల్లడించిన ఫార్మాక్సిల్
హైదరాబాద్, వెలుగు: మనదేశంలో నుంచి ఫార్మా ఎగుమతులు భారీగా పెరిగాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) ప్రకటించింది. 2004–-05లో సంస్థ ఏర్పాటయ్యే నాటికి వీటి విలువ 3.9 బిలియన్ డాలర్లు (రూ.32 వేల కోట్లు) కాగా, 2023–-24 నాటికి 27.85 బిలియన్ డాలర్ల (రూ.2.31 లక్షల కోట్ల)కు చేరింది. 2005 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 11 శాతం ఉందని సంస్థ డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ చెప్పారు.
‘‘2017–-18లో ఎగుమతులు 17.3 బిలియన్ డాలర్లుగా ఉండేవి. 2030 నాటికి అవి 55 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముంది. ఎగుమతులు ఇంతలా పెరగడం వెనుక మా కృషి ఎంతో ఉంది. కరోనా సమయంలో భారత్ స్వదేశీ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. దాన్ని 100 కన్నా ఎక్కువ దేశాలకు సరఫరా చేసి పవర్ హౌజ్ ఆఫ్ వ్యాక్సిన్‌గా పేరు తెచ్చుకుంది. బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్ విభాగం 2023-–24 ఏప్రిల్–-మార్చిలో 1.60 శాతం వృద్ధిని సాధించింది. వ్యాక్సిన్ల ఎగుమతుల విలువ1187.99 మిలియన్ డాలర్లకు చేరింది. దిగుమతులు 1.98 శాతం పెరిగాయి”అని ఆయన అన్నారు.