నెయ్యి, పల్లీ చిక్కీ లేని..న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

  •     పర్వతగిరి పీహెచ్​సీ సిబ్బంది నిర్వాకం
  •     ఆందోళనకు దిగిన గర్భిణులు, బంధువులు

పర్వతగిరి, వెలుగు :  వరంగల్​జిల్లా పర్వతగిరి మండలంలోని పీహెచ్​సీ సిబ్బంది గర్భిణులకు పంపిణీ చేయాల్సిన న్యూట్రిషన్​కిట్లలోని కొన్ని ఐటమ్స్ మాయం చేస్తున్నట్లు బయటపడింది. ఖరీదైన నెయ్యి బాటిల్, పల్లీ చిక్కీ ప్యాకెట్లు లేకుండానే గర్భిణులకు కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం ఏనుగల్లు, చింత నెక్కొండ, తూర్పుతండా, అన్నారం గ్రామాలకు చెందిన దాదాపు 20 మంది గర్భిణులకు పీహెచ్​సీలో న్యూట్రిషన్​కిట్లు అందజేశారు. వాటిలో అతి ముఖ్యమైన నెయ్యి బాటిల్, పల్లీ చిక్కీలు లేవు. గుర్తించిన మహిళలు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్ ఉదయ్ రాజ్, సిబ్బంది వనజ, కల్పనతో వాగ్వాదానికి దిగారు.

ఎక్స్పైర్​ అయిపోవడంతోనే ఇవ్వలేదని సిబ్బంది సమాధానం ఇవ్వగా.. అబద్ధాలు చెబుతున్నారని గర్భిణులు ఆరోపించారు. ముందుగా ఒకరికి ఇచ్చిన కిట్​లో నెయ్యి, పల్లీ చిక్కీ ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిబ్బంది వనజ, కల్పన తమతో దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. పీహెచ్​సీలో కనీసం తాగడానికి మంచినీళ్లు లేవని మండిపడ్డారు.100కు ఫోన్​చేయడంతో పోలీసులు వచ్చి గర్భిణులకు నచ్చజెప్పారు.

పీహెచ్​సీ సిబ్బంది కిట్లలోని ఐటమ్స్​మాయం చేసి తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై డాక్టర్​ఉదయ్​రాజును వివరణ కోరగా.. న్యూట్రిషన్ కిట్ల గురించి తనకు తెలియదని, సిబ్బందికే తెలుసు అన్నారు. డేట్​అయిపోయిన నెయ్యి, హనీ బాటిళ్లు, పల్లీ చిక్కీలను చూపించమంటే సమాధానం దాటవేశారు.