ఇంగ్లాండ్ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్-2024 సీజన్‌లో ఇప్పటివరకూ ఈడెన్ గార్డెన్స్‌లో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన సాల్ట్.. 68.60 సగటుతో 344 పరుగులు (186.65 స్ట్రైక్ రేట్) చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండగా.. 89 (నాటౌట్) హయ్యస్ట్ స్కోర్‌గా ఉంది. తద్వారా భారత మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ, ఆండ్రీ రస్సెల్‌లను వెనక్కి నెట్టాడు.
గతంలో 2010 ఐపీఎల్ సీజన్‌లో గంగూలీ 331(7 ఇన్నింగ్స్‌లు) పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ముందువరకూ 14 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. దానిని ఫిల్ సాల్ట్ ఇప్పుడు బద్దలుకొట్టి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో గంగూలీ రికార్డు రెండో స్థానానికి పడిపోయింది. ఇక గంగూలీ తరువాత ఆండ్రే రస్సెల్ 311 పరుగులతో (2019 ఐపీఎల్) మూడో స్థానంలో ఉన్నాడు.
ఒక ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గడ్డపై అత్యధిక పరుగులు
- 344 పరుగులు: ఫిల్ సాల్ట్ (6 ఇన్నింగ్స్, 2024)
- 331 పరుగులు: సౌరవ్ గంగూలీ (7 ఇన్నింగ్స్‌లు, 2010)
- 311 పరుగులు: ఆండ్రీ రస్సెల్ (7 ఇన్నింగ్స్‌లు, 2019)
- 303 పరుగులు: క్రిస్ లిన్ (9 ఇన్నింగ్స్‌లు, 2018)
- 280 పరుగులు: రింకూ సింగ్ (7 ఇన్నింగ్స్‌లు, 2023)
ఇక సోమవారం(ఏప్రిల్ 29) డీసీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. టాపార్డర్ సహా ఇతర స్టార్ బ్యాటర్లు చేతులెత్తేయగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (35) బ్యాటర్ అవతారమెత్తి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం ఆ లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.