
బీజింగ్: ఫిలిప్పీన్స్ నేవీపై చైనా నేవీ అటాక్ చేసింది. కత్తులు, గొడ్డళ్లు, ఈటెలతో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీ పడవలపై దాడి చేసింది. దీంతో ఇరు పక్షాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైనా సైనికుల దాడిలో పలువురు ఫిలిప్పీన్స్ సైనికులు గాయపడ్డారు. ఒక సైనికుడు తన బొటన వేలును కోల్పోయాడు. ఫిలిప్పీన్స్ కు చెందిన పలు బోట్లను చైనా సైనికులు ధ్వంసం చేశారు. అలాగే వారి నుంచి ఎం4 రైఫిల్స్, నావిగేషన్ ఎక్విప్ మెంట్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. తమ నేవీ బోట్లలో ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా సైనికులు దాడి చేశారని చెప్పారు. ‘‘దక్షిణ చైనా సముద్రంలో వెళ్తుండగా చైనా సోల్జర్లు మా బోట్లలోకి చొరబడి ధ్వంసం చేశారు. ఆయుధాలు, ఇతర సామగ్రిని లాగేసుకున్నారు. మా బోట్లను చుట్టుముట్టి దాడి చేశారు” అని ఫిలిప్పీన్స్ అధికారులు వెల్లడించారు. చైనా సైనికులు సముద్రపు దొంగల్లా వ్యవహరించారని, తమ సైనికులు ఒట్టి చేతులతో పోరాడారని ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ తెలిపారు. కాగా, తమ సైనికులు చేసింది కరెక్టే అని చైనా సమర్థించింది. ఫిలిప్పీన్స్ నేవీ పడవల్లో ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుండగా.. తమ సైనికులు అడ్డుకుని, ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.