25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

తపోవన్‌ ప్రాజెక్టులో పని చేస్తున్నవిపుల్‌‌ కైరేనికి తల్లి ఫోన్‌
25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌

న్యూఢిల్లీ: కొడుకు ప్రాణం డేంజర్‌‌లో ఉందని ఆ తల్లికి భయమైంది. తపోవన్‌‌ ప్రాజెక్టులో పని చేస్తున్న అతనికి ప్రమాదం ముంచుకొస్తోందని ఫోన్‌‌ చేసి హెచ్చరించింది. ఆ ఒక్క ఫోన్‌‌ కాల్‌‌తో తన కొడుకుతో పాటు 24 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారం కిందట ఉత్తరాఖండ్‌‌లోని చమోలీ జిల్లాలో ధౌలిగంగ నది ఉప్పొంగి సుమారు 200 మంది గల్లంతయ్యారు. ఆ ప్రమాదం నుంచి కొందరు అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. అందులో విపుల్‌‌ కైరేనీ టీమ్‌‌ ఒకటి.

డబుల్‌‌ కూలీ వస్తుందని..

ఎన్టీపీసీకి చెందిన తపోవన్‌‌ పవర్‌‌ ప్రాజెక్టు సైట్‌‌ దగ్గర విపుల్‌‌ కైరేని(27) డ్రైవర్‌‌గా పని చేస్తున్నాడు. మామూలు రోజుల్లో కూలీ రూ.600.. ఆదివారమైతే రెట్టింపు. అందుకని గత ఆదివారం 9 గంటలకు విపుల్‌‌ పనికి వెళ్లాడు. విపుల్‌‌ ఊరు ధాక్‌‌.. ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఆ రోజు ఇంటిముందు పనిచేస్తున్న తల్లి మాంగ్‌‌శ్రీ దేవి, భార్య అనితకు ధౌలిగంగ ఉప్పొంగడం కనిపించింది. నదిలో నీటిమట్టం మామూలు కన్నా 15 మీటర్లు పెరగడం గుర్తించారు. వెంటనే ఆ తల్లి కొడుకుకు ఫోన్‌‌ చేసింది. ‘కొడుకా.. ధౌలిగంగ ఉప్పొంగుతోంది. కొండలు పగిలిపోతున్నయ్‌‌. బయటికిరా.. పరుగెత్తు’ అని అరిచింది. తల్లి జోక్‌‌ చేస్తోందని అనుకున్న విపుల్‌‌.. ఫోన్‌‌ కట్‌‌ చేసి పనిలో మునిగిపోయాడు. దీంతో ఆ తల్లి మళ్లీ మళ్లీ ఫోన్‌‌ చేసింది. కొడుకు ఫోన్‌‌ తీసే వరకు చేసి.. అసలేం జరుగుతోందో వివరించింది. దీంతో విపుల్‌‌తో పాటు మరో 24 మంది వెంటనే మెట్ల మీదుగా పైకి చేరుకున్నారు.

మరో 8 డెడ్‌‌బాడీలు దొరికాయి..

తపోవన్‌‌, రైనీ పవర్‌‌ ప్లాంట్‌‌ టన్నెళ్ల దగ్గర రెస్క్యూ ఆపరేషన్‌‌ వారం రోజులుగా కొనసాగుతోంది. ఆదివారం మరో 8 డెడ్‌‌ బాడీలను అధికారులు బయటకు తీశారు. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరిందని అధికారులు చెప్పారు.

పిల్లల కోసం కుక్క తపన

తపోవన్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ దగ్గరకు రోజూ ఓ కుక్క వచ్చిపోతోంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌‌ చేస్తున్న వర్కర్లు వెళ్లగొట్టినా మళ్లీ మళ్లీ వస్తోంది. అటూ ఇటూ చూస్తూ ఏదో వెతుకుతోంది. కొండపైకి పోతోంది. నది దగ్గరకు వెళ్తోంది. దేనికోసమో దీనంగా చూస్తోంది. అసలేం జరిగిందని వర్కర్లు ఆరా తీస్తే ఆ కుక్కకు మూడు, నాలుగు పిల్లలున్నాయని.. అవి ఇటీవలి వరదలకు కొట్టుకుపోయాయని గ్రామస్తులు చెప్పారు. వారం రోజులుగా ఏం తినకుండా తన పిల్లల కోసం ఆ కుక్క వెతుకుతూనే ఉందన్నారు. తినిపించడానికి ప్రయత్నించినా వదిలేస్తోందని చెప్పారు. తన పిల్లల కోసం ఆ కుక్క పడుతున్న ఆరాటం చూసి గుండె బరువెక్కుతోందని అన్నారు.