ఖర్చులు చెల్లిస్తే ఉద్యోగం మీదే .. స్టాఫ్‌‌నర్స్‌‌ క్యాండిడేట్లకు సైబర్‌‌ నేరగాళ్ల నుంచి ఫోన్లు

  • మహిళలకు రూ. 25 వేలు, మగవారికి రూ. లక్ష అంటూ బేరం
  • తమకు సంబంధం లేదంటున్న  వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు
  • సైబర్‌‌ నేరగాళ్ల బారిన  పడొద్దంటున్న పోలీసులు

జనగామ, వెలుగు: మీరు స్టాఫ్‌‌నర్స్‌‌ పోస్ట్‌‌కు సెలెక్ట్‌‌ అయ్యారు.. త్వరలోనే ఇంటర్వ్యూ ఉంటుంది.. కానీ కొంత ఖర్చు అవుతుంది’ అంటూ సైబర్‌‌ నేరగాళ్లు స్టాఫ్‌‌నర్స్‌‌ క్యాండిడేట్లకు వల వేస్తున్నారు. మహిళలకు రూ. 25 వేలు, మగవారికి రూ. లక్ష ఖర్చు అవుతుందని చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. తీరా ఇంటర్వ్యూ లేకపోవడం, అసలు ఉద్యోగానికే సెలెక్ట్‌‌ కాలేదని తెలుసుకొని క్యాండిడేట్లు లబోదిబోమంటున్నారు. రెండు రోజుల కింద జనగామకు చెందిన ఓ మహిళకు ఇలాగే ఫోన్‌‌ చేసి రూ. 75 వేలు వసూలు చేశారు. తర్వాత ఇంటర్వ్యూ లేదని తెలుసుకున్న సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది.

వివరాలు చెబుతూ.. ఫేక్‌‌ ఆర్డర్లు పంపుతూ...

జనగామ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్‌‌ పద్ధతిలో పనిచేసేందుకు ఆరు స్టాఫ్‌‌ నర్స్‌‌ పోస్టులతో పాటు 9 ఎంఎల్‌‌హెచ్‌‌పీ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌‌ విడుదల అయింది. దీంతో స్టాఫ్‌‌ నర్స్‌‌ పోస్టులకు 245 మంది, ఎంఎల్‌‌హెచ్‌‌పీ పోస్టులకు 200 మంది క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు. నియామక ప్రక్రియ మొదట్లో జనగామ డీఎంహెచ్‌‌వో ఆఫీస్‌‌లో వేసిన ప్రొవిజనల్​లిస్ట్‌‌లో అప్లై చేసిన వారి వివరాలను పొందుపరిచారు. ఈ సమాచారం సేకరించిన సైబర్‌‌ నేరగాళ్లు క్యాండిడేట్లకు కాల్స్‌‌ చేస్తూ డబ్బుల వసూలుకు ప్లాన్‌‌ చేస్తున్నారు.

 98313 19614 అనే నంబర్‌‌ నుంచి కాల్‌‌ చేసి క్యాండిడేట్‌‌ పేరు, ఊరు, తల్లిదండ్రుల పేరు, వయస్సు వంటి వివరాలు చెబుతూ నమ్మిస్తున్నారు. తర్వాత ఉన్నతాధికారుల నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆర్డర్లు ఉన్నాయని, ఇందుకోసమే మీకు కాల్‌‌ చేస్తున్నామంటూ చెబుతున్నారు. అలాగే Jangaon.telangana.gov.in@gmail.com అనే మెయిల్‌‌ నుంచి ఫేక్‌‌ ఆర్డర్స్‌‌ కాపీలు పంపుతూ క్యాండిడేట్లను నమ్మిస్తున్నారు. తర్వాత ఖర్చుల కోసం డబ్బులు అవసరం అవుతాయంటూ బేరసారాలకు దిగుతున్నారు.

పర్మినెంట్‌‌ అంటూ వసూళ్లు

సైబర్‌‌ నేరగాళ్ల వలలో చిక్కుకొని కొందరు క్యాండిడేట్లు మోసపోతుండగా మరికొందరు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగాలను పర్మినెంట్‌‌ చేసేందుకు ఖర్చులు ఉంటాయని నచ్చచెపుతున్నారు. టైం తక్కువగా ఉందని, రెండు రోజుల్లోనే ఇంటర్వ్యూ ఉంటుందని, త్వరగా పేమెంట్‌‌ చేస్తే ఉద్యోగం గ్యారంటీ అంటూ చెబుతున్నారు. 

వెంటనే తామిచ్చిన ఫోన్‌‌ నంబర్‌‌కు గానీ, అకౌంట్‌‌ నంబర్‌‌కు గానీ ఆన్‌‌లైన్‌‌లో డబ్బులు చెల్లించాలంటూ చెబుతున్నారు. దీంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు డబ్బులు సెండ్‌‌ చేస్తున్నారు. తర్వాత చెప్పిన డేట్‌‌ రోజున ఇంటర్వ్యూ కోసం డీఎంహెచ్‌‌వో ఆఫీస్‌‌కు వెళ్తుండడంతో అలాంటిదేమీ లేదని అక్కడి సిబ్బంది చెబుతుండడంతో మోసానికి గురైనట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే స్టాఫ్‌‌ నర్స్‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే ఫోన్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని, క్యాండిడేట్లు అలాంటి వారి బారిన పడొద్దని వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

సైబర్‌‌ వలలో చిక్కుకోవద్దు 

నిరుద్యోగులు సైబర్‌‌ వలలో చిక్కుకోవద్దు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌‌ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు. ఈజీ మనీ కోసం సైబర్‌‌ నేరగాళ్లు చేసే ఫేక్‌‌ కాల్స్‌‌పై అలర్ట్‌‌గా ఉండాలి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 కు కాల్‌‌ చేసి ఫిర్యాదు చేయాలి.
-బి.రాజమహేంద్ర నాయక్, డీసీపీ, జనగామ