ఇదీ తెలంగాణ లెక్క: జనాభా తక్కువ.. ఫొన్​ కనక్షన్లు ఎక్కువ....

ఇదీ  తెలంగాణ లెక్క: జనాభా తక్కువ.. ఫొన్​ కనక్షన్లు ఎక్కువ....
  • రాష్ట్రంలో జనాభాకు మించి ఫోన్ కనెక్షన్లు
  • 15 లక్షల ల్యాండ్ లైన్లు, 4.04 కోట్ల సెల్​ఫోన్ కనెక్షన్లు
  • సగటున ఒక్కో ఫ్యామిలీకి ఒకట్రెండు టూ వీలర్లు
  • ప్రతీ ఐదు కుటుంబాలకు ఓ కారు
  • సోషియో ఎకనామిక్ ఔట్ లుక్-2025లో వెల్లడి 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ల్యాండ్ లైన్, సెల్​ఫోన్ కనెక్షన్లు జనాభాకు మించి ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగినా.. 15 లక్షల ల్యాండ్ లైన్ కనెక్షన్లు వినియోగంలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.19 కోట్ల కనెక్షన్లు ఉండగా.. ఇందులో మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్యే 4.04 కోట్లు. ఒక్కొక్కరు రెండేసి ఫోన్లు, సిమ్​లు వినియోగిస్తుండటంతోనే సెల్​ఫోన్ కనెక్షన్ల సంఖ్య ఈ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నది. 2024, సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 3.64 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తాజాగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ -2025 నివేదికలో వెల్లడైంది.

1.25 కోట్ల టూవీలర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 2024, డిసెంబర్ 31 నాటికి మొత్తం 1,71,20,241 వెహికల్స్ రిజిస్టర్ అయి ఉండగా.. ఇందులో 73 శాతం(1,25,86,883) టూవీలర్లే ఉన్నాయి. రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలు ఉండగా.. సగటున ఇంటికి ఒకటి కంటే ఎక్కువగానే టూవీలర్లు ఉన్నట్లు ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత అతిపెద్ద సంఖ్యలో 23,03,759 కార్లు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి ఐదు కుటుంబాలకు ఓ కారు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే, 7,62,682 ట్రాక్టర్లు, ట్రాలీలు, 6,46,021 గూడ్స్ క్యారియర్లు, 5,08,185 ఆటోలు ఉన్నాయి. 1,40,779 మోటార్ క్యాబ్స్, 31,003 స్కూల్, కాలేజీ బస్సులు, 26,867 క్యాబ్స్, 9,071 స్టేజ్ క్యారేజెస్, 11,657 ఈ రిక్షాలు, 93,334 ఇతర వాహనాలు ఉన్నాయి.

ఆర్టీసీ బస్సులు 9,417 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో మొత్తం 9,417 బస్సులు ఉండగా, ఇందులో 6,365 ఆర్టీసీ బస్సులు, 3,052 హైర్ బస్సులున్నాయి. బస్సులు రోజుకు 32.75 లక్షల కిలో మీటర్లు ప్రయాణించి, 59.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో 398 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. త్వరలో 602 కొత్త విద్యుత్ బస్సులు రానున్నాయని, హైదరాబాద్​లో వచ్చే రెండేండ్లలో 2,800 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ లో ప్రభుత్వం వెల్లడించింది.

అడవుల జిల్లా.. ములుగు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అటవీ విస్తీర్ణం 27,688 చ.కి.మీ (24.69%) ఉండగా.. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక 2023 ప్రకారం  జాతీయ సగటు 23.59 కంటే ఎక్కువ. 64.64 శాతం ఫారెస్ట్ కవర్ తో ములుగు జిల్లా అడవుల జిల్లాగా మొదటి స్థానంలో ఉంది. 41.38 శాతం ఫారెస్ట్ కవర్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండో స్థానంలో, 41.15 శాతంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మూడో స్థానంలో ఉంది. అతి తక్కువ ఫారెస్ట్ కలిగిన జిల్లాలుగా కరీంనగర్ (2.29%), జోగులాంబ గద్వాల(2.32%), హనుమకొండ (3.40%) జిల్లాలు ఉన్నాయి. దాని పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, చత్తీస్​గఢ్, ఒడిశా మినహా, ఇది చాలా ఎక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది.