ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర, ప్రాజెక్టు మిత్ర..పేరెంట్స్​తో మాట్లాడేందుకు10 టెలిఫోన్లు ఏర్పాటు

ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర, ప్రాజెక్టు మిత్ర..పేరెంట్స్​తో మాట్లాడేందుకు10 టెలిఫోన్లు ఏర్పాటు
  • గౌలిదొడ్డి క్యాంపస్​లో స్టార్ట్

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ మిత్ర అనే కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గౌలిదొడ్డిలోని ఎస్సీ గురుకుల కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సీవోఈ)  క్యాంపస్ లో ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి లాంఛ్ చేశారు.

ఈ సందర్భంగా అలుగు వర్షిణి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రతి గురుకుల స్కూల్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 7 నుంచి 10 టెలిఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నలుగురు విద్యార్థులకు ఒక ఫోన్ కార్డు ఇస్తామని,  ఈ కార్డును ఉపయోగించి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో  రోజుకు ఎన్ని సార్లయినా ఉచితంగా కాల్ చేసి మాట్లాడవచ్చన్నారు.

 కార్డులో రిజిస్టరైన ఫోన్ నంబర్లకు మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులతో పాటు, మరొకరి నంబరుకు అవకాశం ఇచ్చామని చెప్పారు. ఈ ఫోన్ మిత్ర ద్వారా విద్యార్థులు ఎప్పుడంటే అప్పుడు తమ తల్లితండ్రులతో మాట్లాడి, ఇంటి మీద ఉండే బెంగ నుంచి ఉపశమనం పొందుతారని వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా  268 గురుకుల స్కూళ్లలో ఈ టెలిఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తామన్నారు. స్కూల్ లో సమస్యలు ఉంటే అధికారులకు కూడా ఫోన్ చేసి సమస్యలను వివరించవచ్చని సెక్రటరీ పేర్కొన్నారు.  

ప్రాజెక్టు మిత్రతో మరో కార్యక్రమం

గురుకులాల్లో వివిధ సమస్యలు, మానసిక ఒత్తిడులకు సంబంధించి ప్రాజెక్టు మిత్ర అనే కార్యక్రమం తీసుకొస్తున్నట్లు  అలుగు వర్షిణి వెల్లడించారు. దీనిద్వారా మానసిక ఆందోళనలో ఉన్న విద్యార్థులకు నిపుణులు, టీచర్లతో  కౌన్సెలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. వారిలో మనోధైర్యాన్ని నింపి, చదువుపై తగిన శ్రద్ధ పెట్టేలా చేస్తామన్నారు. తద్వారా స్టూడెంట్లలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాకుండా చేస్తామని వివరించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి స్కూల్ నుంచి హెడ్ మాస్టర్లకు, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి  ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి, వారు తమ ఆటంకాలను అధిగమించి ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా తయారయ్యే విధంగా తీర్చిదిద్దుతామని వర్షిణి పేర్కొన్నారు.