సాఫ్ట్‌‌వేర్ అప్‌‌డేట్‌‌ చేశాక పెరుగుతున్న ఫోన్ సమస్యలు

న్యూఢిల్లీ: సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ అప్‌‌డేట్ చేశాక  ఫోన్‌‌ సమస్యలు  ఎక్కువవుతున్నాయని చాలా మంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. కాల్‌‌ కనెక్ట్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అండ్రాయిడ్‌‌తో పాటు ఐఫోన్ యూజర్లు పేర్కొన్నారు. లోకల్‌‌సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, ఇండియాలోని  60 శాతం మంది ఐఫోన్ యూజర్లు, 40 శాతం మంది అండ్రాయిడ్ యూజర్లు లేటెస్ట్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను అప్‌‌డేట్ చేశాక ఫోన్ సమస్యలు పెరిగాయని అన్నారు. 

కాల్స్ సరిగ్గా కనెక్ట్ కావడం లేదని ఐఫోన్ యూజర్లు ఫిర్యాదు చేయగా,  సాప్ట్‌‌వేర్ అప్‌‌డేట్ తర్వాత యాప్స్ ఫ్రీజ్ అవ్వడం ఎక్కువైందని అండ్రాయిడ్ యూజర్లు తెలిపారు. ఐఓఎస్‌‌ 18 అప్‌‌డేట్ చేసుకున్న ప్రతీ 10 మంది యూజర్లలో ఆరుగురు వివిధ సమస్యలను ఎదుర్కొన్నారు. కాల్స్ కలవడం లేదని 28 శాతం మంది, స్క్రీన్ బ్లాక్ అవుతోందని 12  శాతం మంది, యాప్స్ హ్యాంగ్ అవుతున్నాయని 12 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 

అండ్రాయిడ్‌‌ 15 కి అప్‌‌గ్రేడ్ చేసుకున్న  ప్రతీ10 మంది  యూజర్లలో నలుగురు వివిధ సమస్యలను ఎదుర్కొన్నారు. యాప్స్ హ్యాంగ్ అవుతున్నాయని 33 శాతం మంది,   ఇతర సమస్యలు  ఎదుర్కొన్నామని 12 శాతం మంది తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేదని 44 శాతం మంది పేర్కొన్నారు.