ముచ్చటపడి కొనుక్కున్న ఫోన్.. ఒక్కసారి కిందపడిందా.. స్క్రీన్ పగలడం సంగతేమోగానీ చాలా మంది గుండె పగిలిపోతుంది. మళ్లీ కొత్త స్క్రీన్ వేయించుకునే వరకూ ఫోన్ వాడకానికి పనికిరాకుండా పోతుంది. ఎంత బ్రాండెడ్ ఫోన్ అయినా పగిలిన స్క్రీన్‌తో మెయిన్‌టైన్ చేయడం కాస్త కష్టమే. అయితే ఫ్యూచర్‌లో ఇలాంటి అవస్థలు ఉండవంటున్నారు కెనడాలోని మెక్ గ్రిల్ యూనివర్సిటీ సైంటిస్టులు. యాక్రిలిక్ మిశ్రమాన్ని యాడ్ చేసి కొత్త రకం గ్లాస్‌లను ఫోన్ స్క్రీన్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వీటికి ఫ్రాక్చర్ రెసిస్టెంట్ సాధారణ గాజు కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని, ఎన్నిసార్లు ఫోన్ కిందపడినా పగిలే చాన్స్ ఉండదని చెబుతున్నారు. సముద్రంలో లభించే నత్తగుల్లలు, మొలస్కాన్(ఆల్చిప్పల) పెంకుల మిశ్రమంతో ఈ గ్లాసెస్‌ను తయారు చేస్తారు. ఈ షెల్స్ లోపలి పొరను నాక్రే(కాల్షియం కార్బోనైట్ రూపాల్లో ఒకటి) అంటారు. గాజు లాంటి పదార్థమే అయినప్పటికీ ఇది ప్లాస్టిక్ లాగే ఉండి అన్‌బ్రేకబుల్‌గా ఉంటుందని రీసెర్చర్స్ చెబుతున్నారు.
ఎలా పని చేస్తుందంటే..
మొలస్కాన్ షెల్స్ 95 శాతం సుద్ధతో చాలా పెళుసుగా ఉంటాయి. లోపలి పెంకులను కలుపుతూ ఉన్న నాక్రే పదార్థం ఎంతో ధృడంగా ఉండి తేలికగా కూడా ఉంటుంది. ఇది షెల్ అంత సులువుగా పగిలిపోకుండా కాపాడుతుంది. ఎలా అంటే వీటిని కంపోజ్ చేసే మెటీరియల్స్ కంటే 3 వేల రెట్లు టఫ్‌గా పని చేస్తుంది. ఇప్పటి ఫోన్లలో టెంపరింగ్, లామినేటింగ్ వంటి టెక్నికల్ స్టాండర్డ్స్ స్క్రీన్‌ను ధృడంగా ఉంచినా, వాటి సర్ఫేస్ మాత్రం కొంచెం దెబ్బతిన్నా పనిచేయకుండా పోతాయి. ఇప్పటి వరకూ స్ట్రెంగ్త్, టఫ్నెస్, ట్రాన్స్పరెన్సీ మధ్య కొంత తేడాలు ఉన్నా, ఈ కొత్త మెటీరియల్ మాత్రం వీటి కంటే ఐదు రెట్లు ఎక్కువగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.