- జడ్జిల ఫోన్‌లూ ట్యాప్ చేశారని.. కీలక వివరాలు తెలిశాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు బెయిలు మంజూరు చేయొద్దని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టులో వాదించారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టామని, ఈ వివరాలను సీల్డ్ కవర్‌లో అందజేస్తున్నామని చెప్పారు. పలువురు జడ్జిల ఫోన్లనూ ట్యాప్ చేశారని పీపీ వివరించారు. ఈ కేసులో ఇంకో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే సమయానికి అదనపు సమాచారం పోలీసులకు అందలేదని హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రెగ్యులర్ బెయిలు పిటిషన్ పెండింగ్‌లో ఉండగా తన సోదరి కుమార్తె పెళ్లి ఉన్నందున ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్‌రావు వేసిన పిటిషన్ ను జడ్జి జస్టిస్ సుజన బుధవారం విచారించారు. వాదనల అనంతరం దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అయితే, ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేశారు.
నేడు భుజంగరావు బెయిల్‌పై తీర్పు
ఇదే కేసులో మరో నిందితుడు, మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గతేడాది మార్చిలో అరెస్టయ్యారు. గత ఆగస్టులో వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల కోసం నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులను కోర్టులు పొడిగిస్తూ వస్తున్నాయి. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుజన గురువారం తీర్పు ఇవ్వనున్నారు.
వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు
సికింద్రాబాద్ కంట్మోనెంట్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. పార్కులో విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త జె.ఉమేశ్వరరావు దాఖలైన పిల్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. పికెట్ పబ్లిక్ గార్డెన్‌లోని విగ్రహాల ఏర్పాటుకు అక్రమ నిర్మాణాలను తొలగించాలని, వాజ్‌పేయి స్మారక విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాల బెంచ్ విచారణ చేపట్టంది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేంద్రం వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదిస్తూ.. దేశానికి అంతర్జాతీయంగా ప్రతిష్టలు తెచ్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు 2022లో అనుమతి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధంకాదని తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిల్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఎస్‌వీఐటీకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎస్‌వీఐటీ కాలేజీకి చెందిన వివరాలను సవరించుకోవడానికి ఆ విద్యాసంస్థకు అవకాశం ఇవ్వాలని జేఎన్‌టీయూ, ఏఐసీటీఈలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీకి చెందిన ఈ మెయిల్‌తో సహా ఇతర వివరాలను సవరించుకోవడానికి చాన్స లేకుండా లాక్ చేయడంపై విద్యాసంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులిస్తూ వివరాలను సవరించడానికి అవకాశం ఇవ్వాలంటూ ఎస్‌వీఐటీ సమర్పించిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. వివరాల సవరణకు చివరి తేదీ ఫిబ్రవరి కావడంతో జనవరి 30లోగా కాలేజీకి అవకాశం కల్పించాలని కోరారు. కేవలం విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, వీటిని ఇతరత్రా ఏ రకంగానూ అవకాశంగా తీసుకోరాదని స్పష్టం చేశారు.