ఆ ఇద్దరికీ అమెరికా బహిష్కరణ తప్పదు!

ఆ ఇద్దరికీ అమెరికా బహిష్కరణ తప్పదు!
  • ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసు నిందితులు ప్రభాకర్‌‌‌‌రావు, శ్రవణ్‌‌రావుకు తప్పని తిప్పలు
  • ట్రంప్‌‌ డిపోర్టేషన్ పాలసీతో ఇండియాకు రప్పించేందుకు పోలీసుల చర్యలు
  • యూఎస్ లో అక్రమంగా ఉంటున్నట్లు ఆధారాలు సమర్పించాలని ప్లాన్

హైదరాబాద్‌‌,వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌ కేసు ముందుకు సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్‌‌రావులను ఇండియాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న డిపోర్టేషన్‌‌ పాలసీని రాష్ట్ర పోలీసులు తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు. వీరిని త్వరగా ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

బేగంపేట్‌‌లోని అమెరికా కాన్సులేట్‌‌తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు రిమైండర్స్‌‌ ప్రొసీజర్స్‌‌ను చేపట్టారు. వీరిద్దరిపై ఇప్పటికే జారీ అయిన లుక్ అవుట్ సర్య్కులర్, నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌‌ బెయిలబుల్ వారెంట్స్, లెటర్ ఆఫ్ రెగోరేటరీ, దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం(ఎక్స్‌‌ట్రాడిషన్‌‌) సహా రెడ్‌‌కార్నర్‌‌‌‌ నోటీసుల ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. ప్రభాకర్‌‌‌‌రావు, శ్రవణ్‌‌రావులు తమ వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసం ఉంటున్నారనే ఆధారాలను ట్రంప్ సర్కారుకు అందించనున్నారు.

ఇండియాకు వస్తే జైలు జీవితం తప్పదని..

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ప్రభాకర్‌‌‌‌రావు ప్రధాన నిందితుడుగా, ఐ న్యూస్​ మాజీ ఎండీ శ్రవణ్​ కుమార్ 6వ నిందితుడిగా ఉన్నారు. గతేడాది మార్చి 10న కేసు నమోదైన వెంటనే ప్రభాకర్‌‌‌‌ రావు అమెరికాకు వెళ్లాడు. క్యాన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ కారణంగా అమెరికాకు వెళ్లినట్లు నాంపల్లి కోర్టు, హైకోర్టుల్లో దాఖలు చేసిన పలు పిటిషన్స్‌‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే శ్రవణ్‌‌రావు కూడా అమెరికా పారిపోయాడు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేయడంతో పాటు ఇండియాకు వస్తే జైలు జీవితం తప్పదనే ఉద్దేశంతో ఆయన అమెరికాలోనే తలదాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అన్ని దారులు మూసుకుపోయాయి..!

 ప్రభాకర్‌‌‌‌రావు అమెరికాలోనే స్థిరపడేందుకు గ్రీన్‌‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆయనపై లుక్‌‌ అవుట్ సర్క్యులర్ జారీ కావడంతో పాటు పాస్‌‌పోర్టులు జప్తు కారణంగా గ్రీన్‌‌కార్డు లభించలేదని తెలిసింది. ఈ క్రమంలోనే తమ పాస్‌‌పోర్టులను రద్దు చేయ వద్దని వీరిద్దరూ రీజినల్ పాస్ట్‌‌పోర్ట్ అథారిటీని ఆశ్రయించారు.

దీంతో ఇంటర్‌‌‌‌పోల్‌‌ ద్వారా పోలీసులు రెడ్‌‌కార్నర్ నోటీసులు, ఎక్స్‌‌ట్రాడిషన్‌‌ ప్రక్రియ వేగవంతం చేయడంతో..రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని కోరుతూ ప్రభాకర్‌‌‌‌రావు అమెరికా ప్రభుత్వానికి అప్పీల్‌‌ చేసుకున్నాడు. ఇలా.. అమెరికాలోనే తలదాచుకునేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ, వీటిలో ఏ ఒక్కటి ఫలించలేదు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన డిపోర్టేషన్ పాలసీని పోలీసులు అవకాశంగా చేసుకున్నారు.