
- నేరస్తుల అప్పగింత ప్రాసెస్ పూర్తి
- నేడు మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఓ వైపు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించడం, మరోవైపు పాస్‌పోర్టు రద్దు కావడం, వీటికితోడు త్వరలోనే అమెరికా నుంచి డిపోర్టేషన్ (బహిష్కరణ) ఉండటంతో సిట్ అధికారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్, అరెస్ట్ చేయకుండా విచారణ కోసం ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో శ్రవణ్ రావును సిట్ అధికారులు బుధవారం మరోసారి విచారించనున్నారు.
3 సార్లు విచారణకు హాజరైన శ్రవణ్ రావు
శ్రవణ్ రావు బుధవారం సిట్ విచారణకు హాజరుకానున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గత నెల 29వ తేదీ నుంచి ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరయ్యాడు. ఈ నెల 9వ తేదీన సిట్ అధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నంబర్లు వాటిని ప్రణీత్‌రావు టీమ్‌కు పంపించిన మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా శ్రవణ్ రావును ప్రశ్నించారు. సోదాల టైమ్‌లో శ్రవణ్‌రావు ఇంటి నుంచి సీజ్ చేసిన 3 ఫోన్ల డేటాను రిట్రీవ్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఈ నెల 28వ తేదీ వరకు అమల్లో ఉండడంతో.. నాట్ టు అరెస్ట్ ఆర్డర్‌పై సిట్ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
అక్రమంగా నివాసం ఉంటున్న ప్రభాకర్ రావు
ప్రభాకర్ రావుకు కోర్టులో ఊరట లభించినప్పటికీ స్వతహాగా ఇండియాకు వచ్చే అవకాశాలు లేవని తెలిసింది. పాస్‌పోర్టు రద్దు కావడమే దీనికి కారణం. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు ఎంబసీకి సమాచారం ఇచ్చారు. రెడ్‌కార్నర్ నోటీస్, పాస్‌పోర్ట్ రద్దుకు సంబంధించిన వివరాలతో రిమైండర్లు పంపించారు. ఈ క్రమంలోనే నేరస్తుల అప్పగింత ఒప్పందానికి సంబంధించిన ప్రాసెస్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. వీటి ఆధారంగా వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.