బీఆర్ఎస్ ఓటమితో సమాచారం ధ్వంసం: ప్రణీతరావు వాంగ్మూలం

బీఆర్ఎస్ ఓటమితో సమాచారం ధ్వంసం: ప్రణీతరావు వాంగ్మూలం

 

  • 17 హార్డ్ డిస్కులను మూసీలో పడేశాం

  • వాటి స్థానంలో కొత్తవి అమర్చాం

  • వాటిలో మావోయిస్టుల సమాచారం 

  • 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశాం

  • ఈ ఆపరేషన్ కు 8 ఫోన్లు వినియోగించాం

  •  వీవోఐపీ ద్వారానే  సంభాషణలు చేశాం

  •  ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రోజూ 30 నుంచి  40 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 8 ఫోన్లను వినియోగించినట్టు తెలిపారు. అందులో మూడు అధికారిక ఫోన్లు కాగా.. ఐదు అనధికారికమైనవని అన్నారు. తాము ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిలో విపక్ష నేతలు, జడ్జిలు, జర్నలిస్టులు ఉన్నారని అన్నారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశంతో 1200 ఫోన్లను ట్యాపింగ్ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు  ట్యాపింగ్ ఆపేసినట్టు చెప్పారు. 

నగదు పట్టుకున్నాం..

ప్రతిపక్షాలకు సాయం చేస్తున్న వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు ట్యాపింగ్, ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామన్నారు.  ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంత  సహాయంతో ట్యాపింగ్‌ని విస్తృతం చేశామన్నారు. 17 సిస్టంల ద్వారా..  రెండు లాగర్ రూమ్ లలో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశామని వివరించారు. తాము వీవోఐపీ ద్వారానే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నామని అన్నారు. 

Also read :అదిరేలా ఆవిర్భావం .. రాష్ట్ర లోగోకు తుదిరూపు

కీలకమైన సమాచారం సైతం..

ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారని తెలిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకువచ్చామన్నారు. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశామన్నారు. 17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందన్నారు. 17 హార్డ్ డిస్క్ లను కట్టర్‌తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించారు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామన్నారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లన్నింటినీ కూడా నాగోల్, మూసారంబాగ్ మూసీలో పడవేసినట్టు తెలిపారు. ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు.