భూకబ్జా కేసులో నిందితులతో మిలాఖత్
2014లో కూకట్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితులకు వేధింపులు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ అడిషనల్ డీఎస్పీ భుజంగరావుపై మరో కేసు నమోదయ్యింది. కూకట్‌పల్లి ఏసీపీగా పనిచేసినప్పుడు 340 ఎకరాలకు సంబంధించిన భూవివాదం కేసులో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు బాధితుడు మీర్ అబ్బాస్ అలీ ఖాన్ సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేశాడు. కూకట్‌పల్లిలోని సర్వే నంబర్ 1007లోని 340 ఎకరాల భూమిని ఎస్‌ఎస్ మొయినుద్దీన్, శ్రీనివాస్‌రావు, గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించినట్లు తెలిపాడు. దీనిపై కూకట్‌పల్లి పీఎస్‌లో 2014లో ఫిర్యాదు చేయగా అప్పుడు ఏసీపీగా ఉన్న భుజంగరావు నిందితులతో కలిసి తమను వేధించాడని సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈఓడబ్ల్యూలో కేసు నమోదు
బాధితుడు మీర్ అబ్బాస్ ఇచ్చిన ఆధారాలతో సీపీ అవినాశ్ మహంతి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం ఎస్‌ఎస్ మొయినుద్దీన్, శ్రీనివాస్‌రావు, చలమలశెట్టి అనిల్‌లతో పాటు భుజంగరావుపై ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భుజంగరావు అనారోగ్య సమస్యలతో ఇటీవలే బెయిల్‌పై విడుదల అయ్యారు.ఈఓడబ్ల్యూలో నమోదైన కేసులో డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం సైబరాబాద్ పోలీసులు భుజంగరావును విచారించనున్నారు.