
- ముందస్తు బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తరు
- హైకోర్టుకు పోలీసుల నివేదిక
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో టి.ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి కుటుంబసభ్యులు, సిబ్బంది, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా న్యాయాధికారులు, వ్యాపారులు, అధికారుల వ్యక్తిగత గోప్యతపై దాడి ఇతరులతో కలిసి కుట్రపన్నారని తెలి పారు. దేశం నుంచి పారిపోవడానికి అనారోగ్యం ఓ సాకుగా చూపారని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కీలక హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని తెలిపారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారు మారు చేస్తారని కోర్టుకు చెప్పారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది రిప్లై కోసం న్యాయమూర్తి ఈ నెల 15వ తేదీకి విచారణను వాయిదా వేశారు.
అనారోగ్యముంటే డ్యూటీ ఎలా చేశారు?
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పదవీ విరమణ చేసిన తరువాత రెండుసార్లు పొడిగింపు ఉత్తర్వులతో ఎలా విధులు నిర్వహించారన్నదానిపై సమాధానం ఇవ్వాల్సి ఉందని పోలీసులు కౌంటరులో పేర్కొన్నారు. 2024 మార్చి 10న ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత ఎస్‌ఐబీలో సన్నిహితుల ద్వారా జరిగేవన్నీ గమనిస్తూ కుటుంబంతో సహా తిరుపతి వెళ్లారని, అక్కడి నుంచి చెన్నై, అక్కడి నుంచి మార్చి 11న అమెరికా పారిపోయారని వివరించారు. అంతేకాకుండా 2024 జూన్‌లో దేశానికి తిరిగి వస్తానని కోర్టుకు చెప్పారని, దీన్ని బట్టి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
పదవీ విరమణ చేసినా ఐపీఎస్ కేడర్.. నిబంధనలకు విరుద్ధంగా రెండుసార్లు సర్వీసు పొడిగింపుతోపాటు కీలకమైన నిఘా విభాగానికి 6 నెలలు ఇన్‌ఛార్జిగా పూర్తి బాధ్యతలు నిర్వహించారన్నారు. హైదరాబాద్ వదిలే ముందే ఇంటిలో ఎలాంటి ఆధారాలు లభించకుండా చేశారని ఆరోపించారు. ఏళ్ల తరబడి సేకరించిన జాతీయ సమగ్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన నిధుల తరలింపునకు సాయపడ్డారని తెలిపారు.
ఐన్యూస్ ఎండీ శ్రావణ్‌కుమార్ నియోజకవర్గాల వారీగా ఇచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టారని వెల్లడించారు. దీని వెనుక ఉన్నవారి వివరాలు తెలుసుకోవడానికి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమన్నారు. ఈ దశలో బెయిల్ పై విడుదల చేస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్లడంతోపాటు సాక్ష్యాల తారుమారు
చేయగలరన్నారు.