ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: ప్రభాకర్‌రావు బెదిరించి బీఆర్‌ఎస్‌ బాండ్లు కొనిపించాడు.. హైకోర్టులో సంధ్య కన్వెన్షన్‌ ఎండీ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: ప్రభాకర్‌రావు బెదిరించి బీఆర్‌ఎస్‌ బాండ్లు కొనిపించాడు.. హైకోర్టులో సంధ్య కన్వెన్షన్‌ ఎండీ
  • శ్రీధర్‌రావు ఇంప్లీడ్‌ పిటిషన్‌ 
  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభాకర్‌‌రావు పోలీస్‌‌ ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు తమను బెదిరించి బలవంతంగా బీఆర్‌‌ఎస్‌‌ ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారంటూ హైకోర్టులో ఇంప్లీడ్‌‌ పిటిషన్‌‌ దాఖలైంది. ప్రభాకర్‌‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌‌ పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ జరుపుతన్నది. ఇందులో తమ వాదనలు కూడా వినాలంటూ సంధ్య కన్వెన్షన్‌‌ ఎండీ శ్రీధర్‌‌రావు మంగళవారం ఇంప్లీడ్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

ప్రభాకర్‌‌రావు బెదిరించడం వల్లే బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి చెందిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయాల్సివ చ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తన వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై ప్రభాకర్‌‌రావు తరఫు సీనియర్‌‌ న్యాయవాది టి.నిరంజన్‌‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముందస్తు బెయిలు పిటిషన్‌‌ అని, ఇంప్లీడ్‌‌ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావు ప్రకటించారు. 

తొలుత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, పోలీసుల తరఫున పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వరావు వాదనలు వినిపిస్తూ, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో టి.ప్రభాకర్‌‌రావు ప్రధాన నిందితుడు కనుక ముందస్తు బెయిల్‌‌ ఇవ్వొద్దని కోరారు. న్యాయమూర్తులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఇతర ప్రైవేట్‌‌ వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్‌‌కు ప్రభాకర్‌‌రావు ఆదేశాలు ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్‌‌ఎస్‌‌ ఓడిపోవడంతో హార్డ్‌‌ డిస్క్‌‌లను ప్రభాకర్‌‌రావు ఆదేశాలతో ధ్వంసం చేశారన్నారు. 

అనారోగ్యం కారణంగా బెయిల్‌‌ ఇవ్వాలన్న వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అనార్యోగం అనేది బెయిల్‌‌ పొందడానికి చెబుతున్న సాకని అన్నారు. గతేడాది మార్చి నాటికి ఎలాంటి హెల్త్‌‌ సమస్యల నివేదికలు లేవని, తర్వాత చిన్నపాటి సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. కేసు నమోదు కాగానే దేశం విడిచివెళ్లిపోయారన్నారు. ప్రయాణం చేయరాదని డాక్టర్లు చెప్పినా అమెరికా వెళ్లిపోయారన్నారు. పలుసార్లు సమన్లు పంపినా రాకపోవడంతో వారెంట్‌‌లు జారీ అయ్యాయన్నారు. అంతేగాకుండా మార్చి 10న రెడ్‌‌కార్నర్‌‌ నోటీసు జారీ అయిందన్నారు.

 ప్రకటిత నిందితుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌‌ కింది కోర్టులో ఉందన్నారు. పాస్‌‌పోర్టు రద్దయినందుకే ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరో నిందితుడు శ్రవణ్‌‌రావుకు సుప్రీం కోర్టు ఇచ్చిన రక్షణ తాత్కాలికమేనని, దీని ఆధారంగా ప్రభాకర్‌‌రావుకు వెసులుబాటు ఇవ్వొద్దని కోరారు. కేసీఆర్‌‌ ప్రభుత్వ పెద్దల నుంచి ట్యాపింగ్​ చేయాలంటూ ఫోన్లు వచ్చాయని, వీటన్నింటి గురించి సమాచారం రాబట్టడానికి కస్టోడియల్‌‌ విచారణ అవసరమని, ముందస్తు బెయిలు పిటిషన్‌‌ను కొట్టివేయాలని కోరారు. విచారణ బుధవారం కొనసాగనుంది.