ఫోన్ ట్యాపింగ్ కేసు.. మొత్తం కేటీఆర్, హరీష్ రావే చేశారన్న చక్రధర్ గౌడ్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్పై గతంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. 

సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. చక్రధర్ గౌడ్ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్న చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలోనూ రెండు సార్లు  పోలీసులు పిలిచి  వివరాలు  తీసుకున్నారని,  ఈరోజు రావాలని  పిలిచారని తెలిపారు. సిద్ధిపేటలో హరీష్ ఓడిపోతాడనే భయంతోనే తన ఫోన్ ట్యాప్ చేశాడని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రంగనాయక సాగర్ స్కామ్ బయటపెట్టానని చక్రధర్ గౌడ్ చెప్పుకొచ్చారు.

మూవీ ఇండస్ట్రీలో వారి ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేస్తే, పొలిటికల్గా హరీష్ రావు చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సిట్ మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. హరీష్ రావుని పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం బయటపడుతుందని, ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిమీద చర్యలు తీసుకోవాలని చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు.