ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు!

ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు!
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరారు
  • మరో జిల్లా స్థాయి లీడర్​కు కూడా ఇచ్చే చాన్స్ 
  • వీరిలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ లీడర్లు 
  • నిందితులు భుజరంగరావు, తిరుపతన్నతో లింకులు

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న కాల్‌డేటా, వాట్సాప్ చాట్స్ కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ జిల్లా స్థాయి లీడర్ కు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సిట్ షెడ్యూల్ ఖరారు  చేసినట్టు సమాచారం. గురువారం సిట్ విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరుకానున్నారు. ఆయనను విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. వీరిలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలిసింది.  

ట్యాపింగ్​తో బ్లాక్ మెయిల్.. 

గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సహా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందించే ఫోన్ నెంబర్స్‌‌ను ప్రణీత్ రావు ఆధ్వర్యంలోని ఎస్‌‌ఐబీ టీమ్ ట్యాపింగ్ చేసేది. సంబంధింత వ్యక్తుల వ్యక్తిగత, కుటుంబ, అనుచరుల వివరాలు, వ్యాపార లావాదేవీలను సేకరించేది. ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్‌‌ లీడర్ల ఫోన్ నెంబర్స్‌‌తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఇందులో ప్రణీత్‌‌రావుతో కలిసి పని చేసిన కానిస్టేబుల్ నుంచి అడిషనల్‌‌ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్టు సిట్‌‌ దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్‌‌ ద్వారా రికార్డ్‌‌ చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్‌‌మెయిల్ చేసినట్టు సిట్‌‌ ఆధారాలు సేకరించింది.  

ఆ డేటా ఆధారంగా.. 

మునుగోడు, హుజూరాబాద్‌‌, మెదక్‌‌ ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఆపరేషన్స్‌‌ ప్రారంభించింది. గత ప్రభుత్వ పెద్దలు అందించిన ఫోన్‌‌ నెంబర్స్‌‌ను ట్యాప్‌‌ చేసి ఆయా జిల్లాల్లోని స్పెషల్ టీమ్స్‌‌కు అందించేది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌నగర్‌‌‌‌లోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు పాల్పడినట్టు సిట్‌‌ గుర్తించింది. భుజరంగరావు, తిరుపతన్న ఫోన్ల నుంచి సేకరించిన డేటాకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్‌‌ ఆధారంగా ఆయా జిల్లాల బీఆర్‌‌‌‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్టు తెలిసింది.