ఫోన్ ట్యాపింగ్ కేసు: శ్రవణ్ రావును 5 గంటలు విచారించిన పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: శ్రవణ్ రావును  5 గంటలు విచారించిన పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది.  హైదరాబాద్ లోని  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐదు గంటల పాటు శ్రవణ్ రావు ను ప్రశ్నించారు అధికారులు. ఫోన్ టాపింగ్ కేసులో ఇంకోసారి శ్రవణ్ రావు ను  సిట్ బృందం విచారణకు  పిలిచే అవకాశం ఉంది.

ఏప్రిల్ 16న  జూబిలీహిల్స్ పోలిస్టేషన్ లో ఉదయం 11 :30 గంటల నుంచి శ్రవణ్ రావును పోలీసులు విచారించారు.  శ్రవణ్ రావు సెల్ ఫోన్ లో డిలీట్ చేసిన సమాచారాన్ని రీట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రవణ్ రావు విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ను కొట్టి వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుకి  శ్రవణ్ రావు ఎవరెవరి సెల్ ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేశాడనే దానిపై వివరాలు ఆరాదీశారు పోలీసులు.   పోలీసుల విచారణలో శ్రవణ్ రావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 

నాలుగు సార్లు విచారణకు హాజరైన శ్రవణ్‌‌ రావు

శ్రవణ్‌‌ రావు సిట్ విచారణకు హాజరుకావడం నాలుగోసారి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్చి  29వ తేదీ నుంచి ఇప్పటి వరకు  4 సార్లు విచారణకు హాజరయ్యాడు. ఏప్రిల్ 9వ తేదీన సిట్‌‌ అధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌‌కు గురైన ఫోన్‌‌ నంబర్లు వాటిని ప్రణీత్‌‌రావు టీమ్‌‌కు పంపించిన మొబైల్ ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా శ్రవణ్‌‌ రావును ప్రశ్నించారు. సోదాల టైమ్​లో శ్రవణ్‌‌రావు ఇంటి నుంచి సీజ్ చేసిన 3 ఫోన్ల డేటాను రిట్రీవ్ చేసేందుకు సిట్‌‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఏప్రిల్ 28వ తేదీ వరకు అమల్లో ఉండడంతో.. నాట్‌‌ టు అరెస్ట్‌‌ ఆర్డర్‌‌పై సిట్‌‌ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.