తెలంగాణ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ మొత్తం భారతదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ విషయం మీదనే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అప్పుడెప్పుడో 1988లో కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఈ విధమైన టెలిఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆరోపణ రావడంతో ఆయన నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో ఎక్కడో ఒకచోట కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అతి ముఖ్యమైన విషయాల మీద ఈ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి విమర్శలు, ఆరోపణలు వచ్చేవి.
మహారాష్ట్రలో ఫోన్ల ట్యాపింగ్
1990 దశకంలో ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన ఘటనల నేపథ్యంలో అనుమానం ఉన్నవారి ఫోన్లమీద నిఘాపెట్టి ట్యాపింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అక్రమ ఆయుధాలు కలిగియున్నారని, తీవ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అనుమానంతో కొంతమంది ప్రముఖ హిందీ నటుల ఫోన్లను ట్యాపింగ్ చేసారని, మహారాష్ట ప్రభుత్వ పెద్దలు, పోలీసులు వింటున్నారని వార్తలు వచ్చాయి.
కేంద్ర అనుమతి తప్పనిసరి
వాస్తవంగా కేంద్రప్రభుత్వానికి టెర్రరిస్టులు, సంఘవిద్రోహ శక్తులు, ఇతర అతి ప్రమాదకర వ్యక్తులు, సంస్థల గురించి ఆధారాలతో ఆరోపణలు వెలువడినప్పుడు వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వ సార్వభౌమాధికారంలో భాగంగా దేశభద్రత గురించి కేంద్రపాలకులకు ఉన్న విచక్షణాధికారాలలో ఈ ట్యాపింగ్ పద్ధతి ఒకటి. ఆరోపణలు ఉన్నవారి ఫోన్లను రాష్ట్ర స్థాయిలో టాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యవస్థలనే తప్పదోవ పట్టించిన కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా విదేశాల నుంచి తెప్పించిన ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థతో ప్రతిపక్షాల నాయకుల ఫోన్లను, ఇతర ఫోన్లను ట్యాపింగ్ చేయమని చెప్పడంతో వారి ఆదేశాలకు అనుగుణంగా పోలీసు అధికారులు వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ ఉంది కదా అని ఈ పోలీసులు తమ వ్యక్తిగత అవసరాలకోసం, స్వార్ధం కోసం అనేక మంది వ్యాపారుల ఫోన్లను, ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసి మొత్తం వ్యవస్థను పక్కదోవ పట్టించారు.
పౌరుల స్వేచ్ఛకు భంగం
ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని సీనియర్ నాయకుడైన ఆనం నారాయణరెడ్డి ఆరోపించారు. ఇదే తరహాలో మరికొంతమంది నాయకులు ఆరోపణలు చేశారు. ఆనం రామనారాయణరెడ్డి చివరకు తన మనవళ్లుతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ ఫోన్లు వాడే దుస్థితి వచ్చిందని వాపోయారు.
కేసీఆర్‌కు సన్నిహితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకమంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఏకంగా ఓ ప్రముఖ దినపత్రిక, ఛానెల్ యజమాని నా ఫోన్ కూడా ఆంధ్రప్రదేశ్ పాలకులు ట్యాపింగ్ చేస్తున్నారని ఇటీవలనే బయటి ప్రపంచానికి తెలియజేశారు.
కంచే చేను మేసినట్లు..పోలీసులే డబ్బు రవాణా చేశారు!
నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నేరుగా పోలీసుల వాహనాలలో ప్రజలకు డబ్బులు పంచడానికి చేరవేశామని టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు విచారణలో చెప్పారు. మొత్తంమీద ఇక నుంచి పౌరుల హక్కులకు, స్వేచ్ఛకు, గోప్యతకు, భద్రతకు భంగం వాటిల్లినట్లేనని అనేకమంది భయాందోళనకు గురవుతున్నారు. చివరకు భార్యాభర్తల మాటలు కూడా ట్యాపింగ్ ద్వారా వినే దుస్థితి వచ్చిందంటే నేటి పాలకుల ఆలోచనా విధానాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్