కంటిపాపకు ఫోన్ ముప్పు.. 90 వేల మందికిపైగా పిల్లల్లో ఐ ప్రాబ్లమ్స్.. స్క్రీన్ టైం పెరగడమే కారణం

కంటిపాపకు ఫోన్ ముప్పు.. 90 వేల మందికిపైగా పిల్లల్లో ఐ ప్రాబ్లమ్స్.. స్క్రీన్ టైం పెరగడమే కారణం

హైదరాబాద్, వెలుగు :  నిత్యం ఫోన్​కు అతుక్కుపోయే పిల్లల్లో  కంటి సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్​బీఎస్​కే) లో  భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో సుమారు  90 వేల మంది పిల్లలు ఐ ప్రాబ్లమ్స్​తో  బాధపడుతున్నట్టు తేలింది. చాలా మంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్​ చేసుకోలేకపోతున్నారని,  పుస్తకాన్ని కళ్లకు దగ్గరగా పెట్టుకొని చదువుతున్నారని గుర్తించారు. పిల్లల్లోని దృష్టిలోపం వారి చదువులపై ప్రభావం చూపుతున్నదని తేల్చారు. 

కాగా, పిల్లల్లో కంటి సమస్యలు పెరగడానికి స్మార్ట్​ఫోన్లు, టీవీలే కారణమని  డాక్టర్లు అంటున్నారు. కరోనా తర్వాత  పిల్లలంతా స్మార్ట్​ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుండడం వల్లే స్క్రీన్​టైం పెరిగి, కంటి సమస్యలు  పెరుగుతున్నాయని చెప్తున్నారు. కొవిడ్​ తర్వాత చాలా స్కూళ్లు వాట్సాప్ ద్వారా హోంవర్క్స్​ఇవ్వడం, వాటి కోసం ఆన్​లైన్​లో సమాచారం సేకరించాల్సి రావడం, పేరెంట్స్​ కూడా ఆన్ లైన్ లెర్నింగ్ యాప్స్ లలో  కోచింగ్ లు ఇప్పిస్తుండడంతో.. ఎక్కువమంది స్టూడెంట్లు  ఇంట్లో ఉన్న టైం అంతా స్ర్కీన్ ముందే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొందరు పిల్లలు ఆన్​లైన్​ స్టడీస్ పేరుతో సోషల్​మీడియాలో రీల్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ, బ్రౌసింగ్ చేస్తూ గడుపుతున్నారు. మొబైల్, డెస్క్ టాప్ ను పరిమితంగా వాడకపోవడం, కంటి నుంచి తగినంత దూరం పాటించకపోవడం వల్లే సమస్య పెద్దదవుతున్నదని ఆఫ్తాల్మాలజిస్ట్​లు అంటున్నారు.

తగ్గుతున్న బ్లింకింగ్ రేట్..

సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 30 నుంచి 40 సార్లు కంటి రెప్పలను కొట్టాలి. కానీ స్ర్కీన్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కంటిని నిమిషానికి 20 సార్లు కూడా కొట్టట్లేదు. దీంతో కండ్లు తడారిపోయి ‘డ్రై ఐ సిండ్రోమ్’ బారినపడ్తున్నారు. కనురెప్పలు సహజంగా కొట్టుకోవడం వల్ల కంటికి నీరు చేరుతుంది. స్క్రీన్ ముందు గడిపేవారి బ్లింకింగ్ తక్కువ ఉండటంతో కండ్లు తొందరగా తడారిపోయి తలనొప్పి, ఇరిటేషన్​ కు గురవుతున్నారు. ఎండిన కండ్లను రబ్ చేయడం వల్ల కనుపాపలు దెబ్బతిని చూపు మసకబారుతున్నది. ఇటీవలి కాలంలో పిల్లల్లో దూరదృష్టి సమస్యలు (మయోపియా) ఎక్కువవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

సాధారణంగా మయోపియో సైట్ ఏడాదికి ఒక్కసారి మారుతుందని, కానీ  స్క్రీన్ టైమ్ పెరుగుతుండటం వల్ల ఆరునెలలకోసారి సైట్ నంబర్ పెరుగుతున్నదని అంటున్నారు. దగ్గరి వస్తువులు కనిపించకపోవడం (హైపరోపియా) గతంలో పెద్దల్లో ఉండేదని, ఇప్పుడు  పిల్లల్లోనూ ఈ సమస్య వస్తున్నదని డాక్టర్లు పేర్కొంటున్నారు.  స్క్రీన్ పై వచ్చే బ్లూలైట్ ఎక్స్ పోజర్ వల్ల వృద్ధాప్యంలో రావాల్సిన మాక్యులర్ డీజెనరేషన్  చిన్నతనంలోనే వస్తున్నదని, అందువల్ల బ్లూలైట్ కాంట్రాస్ట్ తగ్గించాలని సూచిస్తున్నారు. 

దృష్టి లోపాన్ని బట్టి మందులు, కండ్లద్దాలు 

పిల్లల్లో కంటి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒకసారి, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మరోసారి రెండు దఫాలుగా గవర్నమెంట్​స్కూళ్లలో కంటి పరీక్షలు నిర్వహించింది.  మొత్తం 19 లక్షల మంది విద్యార్థుల్లో 89 వేల మందికి పైగా  కంటి సమస్యలతో  బాధ పడుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.  వీరందరికీ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా 59  దవాఖానాల్లో రీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. గత సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించగా,  ఆయా ఆసుపత్రుల్లో  రోజూ  100 నుంచి 200 మంది విద్యార్థులకు వచ్చే నెల 5వ తేదీ వరకు  రీ స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగనున్నాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో 35 వేల మంది పిల్లలకు రీ స్క్రీనింగ్ పూర్తయింది. పిల్లల్లో సమస్యలను బట్టి మెడిసిన్ ఇవ్వడంతోపాటు డాక్టర్ల రికమండేషన్ల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరంలోపు కండ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. 

20 –20– 20 రూల్ పాటించాలి

ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆన్ లైన్ సమాచారం మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కాబట్టి ఫోన్, కంప్యూటర్ ను వాడకుండా పిల్లల్ని కట్టడి చేయలేం. అలాగని, వాటిముందు గంటల తరబడి అలాగే వదిలేయకూడదు. పరిమిత దూరంలో, పరిమిత సమయం వాటిని వాడేలా చూడాలి. స్క్రీన్  బ్లూలైట్ ఎక్స్ పోజర్ ను తగ్గించాలి. స్క్రీన్ ను చూసే ముందు రూం లైట్లు అన్ని వెలుగుతూ ఉండేలా చూడాలి.

ముఖ్యంగా 20–20–20 రూల్ ను ఫాలో అయ్యేలా పేరెంట్స్ శ్రద్ధ పెట్టాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ ను పక్కన పెట్టి 20 ఫీట్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకండ్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల... కండ్ల మజిల్స్​ రిలాక్స్ అవుతాయి. కంటి సమస్యలు లేకపోయినా.. ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో కావడం వల్ల పిల్లలను కంటి సమస్యల నుంచి దూరం చెయ్యొచ్చు. 

– డాక్టర్ కాడ సత్యనారాయణ, ఆఫ్తాల్మాలజిస్ట్ అండ్ రెటినాల్ సర్జన్