ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ చనిపోయాడని అందరికీ తెలిసిందే. అయితే అతని మరణం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాన్ని అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ వెలుగులోకి తీసుకొచ్చింది. డానిష్ కాల్పుల్లో చనిపోలేదని.. అతన్ని తాలిబన్లు పట్టుకొని ఉరి తీసి చంపారని పేర్కొంది.
డానీష్ కాల్పుల్లో చనిపోలేదని.. తాలిబన్లు పట్టుకొని దారుణంగా హత్యచేశారని అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్న మైఖేల్ రూబిన్ తమ మ్యాగజైన్‌లో రాశారు. ‘పులిట్జర్ బహుమతి విజేత డానీష్ సిద్దిఖీ (38) చనిపోయిన సమయంలో స్పిన్ బోల్డాక్ జిల్లాలోని కాందహార్ నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ ఆఫ్ఘన్ దళాలకు మరియు తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలను కవర్ చేస్తుండగా డానీష్ గాయపడ్డాడు. దాంతో ఆయనను కొంతమంది ఆర్మీ సిబ్బంది స్థానికంగా ఉన్న మసీద్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ విషయం పసిగట్టిన తాలిబన్లు.. మసీద్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. డానీష్‌తో పాటు ఉన్న ఆఫ్ఘన్ కమాండర్ మరియు మరో ముగ్గురు సిబ్బందిని బందించారు. అయితే డానీష్ మీద జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన ఆఫ్ఘన్ అధికారులను చంపేశారు. అనంతరం డానీష్‌ను విచారించారు. ఆయన ఐడీ కార్డు కూడా చెక్ చేశారు. ఆ తర్వాతే సిద్దిఖీని తీవ్రంగా కొట్టి, గన్‌తో కాల్చి.. ఆ తర్వాత ఉరి తీశారు’ అని రూబిన్ తన మ్యాగజైన్‌లో తెలిపారు.