
- జులైలో మిస్సయిన విద్యార్థులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మృతదేహాల ఫొటోలు
మణిపూర్: మణిపూర్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. జులైలో కనిపించకుండా పోయిన ఇద్దరు స్టూడెంట్ల మృతదేహాల ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కిడ్నాప్, హత్య దురాగతంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. మణిపూర్ ప్రభుత్వం కూడా ఈ దారుణంపై సీరియస్ అయింది. కేసును సీబీఐకి అప్పగించినట్లు ప్రకటించింది.
ఫొటోలోని యువతి, యువకుడిని మైతీ వర్గానికి చెందిన హిజామ్ లింతోంగంబి(17), ఫిజామ్ హేమ్జిత్(20)గా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్, హత్యకు గురైన వీరి మృతదేహాలు ఇంకా లభ్యంకాలేదు. పరిస్థితి మెల్లమెల్లగా కుదుటపడుతుంది అనుకుంటున్న టైమ్‌లో ఈ ఘటనతో మళ్లీ ఎక్కడ హింస చెలరేగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఏడాది మార్చిలో రిజర్వేషన్ల వివాదంతో మైతీ, కుకీ వర్గాల మధ్య గొడవలు మొదలైన సంగతి తెలిసిందే.
కారకులను వదలం: సీఎం బీరేన్‌సింగ్
హిజామ్ లింతోంగంబి, ఫిజామ్ హేమ్జిత్ జులై 6 వ తేదీ నుంచి కనిపించడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫొటోలో వీరు అడవిలో కూర్చొని ఉన్నారు. వాళ్ల వెనక కొద్ది దూరంలో తుపాకులతో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మరో ఫొటోలో వీరిద్దరి మృతదేహాలు నేలపై పడేసి ఉన్నాయి. వారిద్దరూ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై మణిపూర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం బీరేన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాల ఫొటోలు వైరల్ కావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాల్లో నమోదైనా ఆచూకీ దొరకలే
చురచాంద్‌పూర్ జిల్లాలోని వింటర్ ఫ్లవర్ టూరిస్ట్ స్పాట్ సమీపంలోని లామ్‌డాన్‌లో స్టూడెంట్ల లొకేషన్ గుర్తించామని పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లే మార్గంలో వివిధ షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో వారు కనిపించినా.. జాడ మాత్రం తెలియలేదు. అయితే కుకీ మిలీషియానే ఈ దారుణానికి తెగబడిందని మైతీ వర్గం ఆరోపిస్తున్నది.