స్కూళ్లల్లో ఇక టీచర్ల ఫొటోలు

స్కూళ్లల్లో ఇక టీచర్ల ఫొటోలు
  • క్లాస్​ రూముల్లో ఏర్పాటు చేయనున్న సర్కార్
  • బినామీలు, డుమ్మా కొట్టే టీచర్లపై నిఘా 
  • సబ్జెక్టు, ఫోన్ నెంబర్లతో సహా ప్రదర్శన 
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ 

ఆదిలాబాద్, వెలుగు : సర్కార్  బడుల బలోపేతానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో టీచర్ల పనితీరు.. సమయపాలనపై దృష్టి సారించింది. చాలా జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో కొంతమంది టీచర్లు సమయానికి వెళ్లకపోవడం.. బినామీలను పెట్టి విద్యాబోధన చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల్లో ఎంత మంది టీచర్లు పనిచేస్తున్నారు.. వారెవరనేది స్టూడెంట్లకు, తల్లిదండ్రులకు తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాల తరగతి గదుల్లో సబ్జెక్ట్ వైజ్​గా ఉపాధ్యాయుల ఫొటోలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బయోమెట్రిక్ విధానం అమలు చేసినప్పటికీ కొంత కాలంగా ఆగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న విధానంతో పాఠశాలల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.  

వచ్చింది మా టీచరేనా?

ప్రతి స్కూల్​లోని తరగతి గదిలో ఆ పాఠశాలలో ఎంత మంది టీచర్లు ఉన్నారనే సమాచారంతో పాటు వారి ఫొటోలు, ఫోన్ నెంబర్లు, బోధించే సబ్జెక్టు సహా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేసేలా పూర్తి వివరాలతో నోటీసు బోర్డులో ఉంచాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం ద్వారా టీచర్లు వస్తున్నారా.. డుమ్మా కొడుతున్నారా.. వచ్చిన టీచర్ ఫొటోలో ఉన్న వ్యక్తా, కాదా అనేది విద్యార్థు లకు కూడా తెలిసిపోతుంది.

ఒకవేళ టీచర్ రాకపోతే బడిలో ఏర్పాటు చేసిన టీచర్ ఫోన్ నెంబర్​కు కాల్ చేసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటు టీచర్ల బదిలీ సమయంలోనూ సదరు పాఠశాలకు వచ్చిన కొత్త టీచర్ ఎవరనేది తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియడం లేదు. 

 ప్రైవేట్ వ్యక్తులతో బోధన

నార్నూర్ మండలంలోని గంగాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్​లో ఓ టీచర్ తనకు బదులు బినామీగా ప్రైవేట్ వ్యక్తిని పెట్టి చదువు చెప్పించాడు. ఇటీవల ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆ స్కూల్​లో తనిఖీ చేయగా గవర్నమెంట్ టీచర్​కు బదులు ప్రైవేట్ వ్యక్తి దర్శమివ్వడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్​చేశారు.

Also Read :- బడుగు, బలహీన వర్గాల గొంతు కాకా వెంకటస్వామి

ఐదు నెలల క్రితం తలమడుగు మండలంలోని ఓ స్కూల్​లోని టీచర్ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో డీఈవో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో మారుమూల బడుల్లో బినామీలతో చదువు చెప్పిండమే కాకుండా కొంత మంది ఉపాధ్యాయులు డ్యూటీకి డుమ్మా కొట్టడం.. రిజిస్ట్రర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోవడం, అనుమతి లేకుండా సెలవులు పెడుతున్నారు. 

బోధనపై సర్కార్ ఫోకస్

విద్యాబోధనపై ప్రభుత్వం మొదటి నుంచి ఫోకస్ పెట్టింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు సంవత్సరాల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,848 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, 12వేల మంది టీచర్లు పనిస్తున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం చేపట్టడంతో బోధన మరింత మెరుగుపడింది.

అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంత మంది టీచర్ల నిర్లక్ష్యంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. తాజా ప్రభుత్వం నిర్ణయంతో వీటికి చెక్ పడే అవకాశం ఉంది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో అమలు చేస్తాం 

ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల ఫొటోలతో పాటు పూర్తి సమాచారం ఉంచాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి టీచర్​ కచ్చితంగా అందుబాటులో ఉండాలి. అనుమతి లేకుండా వెళ్లిన.. ఆయన బదులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తిని ఉంచితే తగు చర్యలు తీసుకుంటాం.   ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్