పోలీసుల వీక్లీ ఆఫ్​ మరిచిన్రు.. 24 గంటల డ్యూటీతో శారీరక, మానసిక సమస్యలు

  •     సిబ్బంది తక్కువ, పని ఎక్కువ  
  •     లా అండ్ ​ఆర్డరే ​కాకుండా అన్ని పనులకూ వారే...
  •     కుటుంబంతో గడిపే క్షణాలు తక్కువే...
  •     వీక్లీ ఆఫ్​ ప్రస్తావన తెచ్చిన గత ప్రభుత్వం..
  •     అమలుకు మాత్రం నోచుకోలే...

పెద్దపల్లి, వెలుగు : ప్రజా రక్షణ కోసం 24 గంటలూ డ్యూటీ చేసే పోలీ సులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వారంలో ఒక రోజు రిలాక్స్​ అవుదామనుకున్నా, కుటుంబంతో గడుపుదామన్నా అవకాశం లేకుండా పోతోంది. 2019 లో బీఆర్​ఎస్ ​సర్కార్​ పోలీసులకు వీక్లీ ఆఫ్​ఇవ్వాలని, లేదంటే పది రోజులకో సెలవు ఇవ్వాలని అప్పటి డీజీపీకి ఆదేశాలిచ్చింది. కానీ, ఆచరణలో మాత్రం పెట్టలేదు. దీంతో ఒక్కరోజు కూడా రెస్ట్ ​లేకుండా డ్యూటీ చేస్తున్న పోలీసులు శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. పైగా జిల్లాల్లో సరిపోయేంత సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై భారం పెరిగిపోయింది. అటు వీక్లీ ఆఫ్​ లేకుండా ఇటు పని ఒత్తిడి పెరిగి తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.  

ఎమర్జెన్సీలో ముందుండేది పోలీసన్నే... 

అత్యవసర పరిస్థితుల్లో ముందు నిలిచి డ్యూటీలు చేసే పోలీసులను  గత ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ప్రతి పనికి వారిని ఉపయోగించుకుంటూ..వారి యోగక్షేమాల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. కరోనా టైంలో పోలీసులు ఫ్రంట్​ లైన్ ​వారియర్స్​గా పనిచేశారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన చెక్​పోస్టుల దగ్గర రాత్రనకా, పగలనకా కాపలా కాసి వైరస్ ​వ్యాప్తి చెందకుండా కట్టడి చేశారు. అక్కడే టెంట్లు వేసుకుని నెలల పాటు కుటుంబాలకు దూరంగా గడిపారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు కోవిడ్ ​బారిన పడి కన్నుమూశారు. ఇలాంటి సందర్భాల్లో వారిని వాడుకోవడమే గానీ..పట్టించుకునే ప్రభుత్వాలే లేకుండా పోయాయి.  

లా అండ్​ ఆర్డర్ తో పాటు అన్ని పనులకూ వారే.. 

పోలీస్ ​డిపార్ట్​మెంట్​ను లా అండ్​ ఆర్డర్​కే పరిమితం చేయకుండా అన్ని రకాల పనులకు ఉపయోగించు కుంటున్నారు. గత బీఆర్ఎస్ ​సర్కారు హరితహారం లాంటి కార్యక్రమంలోనూ ఇన్​వాల్వ్​ చేసింది. రాష్ట్రంలో సుమారు 4.50  కోట్ల జనాభా ఉండగా వీరికి రక్షణగా ఉన్నది కేవలం లక్షా అరవై వేల మంది పోలీసులు మాత్రమే..అంటే సుమారు 281 మందికి ఒక్క పోలీసు అన్నమాట. ప్రస్తుతం పెరుగుతున్న నేరాలు, ఘోరాలు, ఇతర సమస్యల నేపథ్యంలో వందమందికి ఒక పోలీసును నియమించాల్సిన అవసరం  ఉందని మాజీ పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. ఉన్న సిబ్బందిని కూడా ప్రజాప్రతినిధుల రక్షణకు, వారి సమావేశాల సెక్యూరిటీ  కోసం వినియోగించుకుంటుండడంతో లా అండ్​ ఆర్డర్ ​కాపాడడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో ఏదైనా జిల్లాల్లో మంత్రుల పర్యటన ఉంటే ప్రతిపక్ష పార్టీల లీడర్లను బైండోవర్​చేయడానికి, మినిస్టర్లను ఎవరూ అడ్డుకోకుండా చూడడానికే పోలీసు సిబ్బంది తమ టైమంతా వెచ్చించాల్సి వచ్చేది. మావోయిస్టుల ప్రాబల్యం బలంగా ఉన్న  కాలంలో హిట్​లిస్టులో ఉన్న లీడర్లను రక్షించడానికి మాత్రమే పోలీసులు సెక్యూరిటీగా వచ్చేవారు. కానీ, తెలంగాణ వచ్చాక ప్రజాప్రతినిధుల రక్షణకే పోలీసు వ్యవస్థ అన్నట్టు తయారైంది. పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయాలంటే ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంచాలనే వాదనలు వినిపిస్తున్నాయి.  

పోలీసు మాన్యువల్​లో ఉన్నా.....

పోలీసులకు వీక్లీ ఆఫ్​ ఇవ్వాలని పోలీసు మ్యానువల్​లోనే ఉంది. కానీ, అది ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. వీక్లీ ఆఫ్ ​ఇవ్వకపోవడానికి పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఓ కారణమవుతోంది. ప్రతి యేటా1000 మందికి పైగా పోలీసులు పదవీ విరమణ పొందుతున్నారు. కొందరు అకస్మాత్తుగా చనిపోతున్నారు. మరికొందరు వీఆర్ఎస్ ​తీసుకుంటున్నారు. ఇలా ప్రతి సంవత్సరం పోలీసు శాఖలో 1500 వరకు ఖాళీలు ఏర్పడుతున్నాయి. కానీ దీనికి తగ్గట్టు పోలీసుల నియామకం జరగడం లేదు. ప్రస్తుతం ఈ శాఖలో దాదాపు 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతుండడం ఈ శాఖకు మైనస్​గా మారింది. సీఐ నుంచి ఎస్పీ వరకు హోంగార్డులను, కానిస్టేబుల్స్​ను  తమ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు. అంతేగాక రిటైర్ ​అయిన ఐఏఎస్​, ఐపీఎస్​, జడ్జీలకు రక్షణ పేరుతో సిబ్బందిని అలాట్ ​చేస్తున్నారు. గతంలో టార్గెట్ ​పర్సన్స్​కు మాత్రమే రిటైర్​ అయిన తర్వాత ప్రొటక్షన్ ​పేరుతో సిబ్బందిని కేటాయించేవారు. కానీ, ఇప్పుడు 10 శాతం సిబ్బంది ఇలాంటి వృథా  డ్యూటీలు చేయాల్సి వస్తున్నది. దీన్ని అదుపు చేస్తే ఆ పోలీసు సిబ్బందిని లా అండ్​ ఆర్డర్​కు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. నియామకాలతో పాటు ఉన్న స్టాఫ్​ను సక్రమంగా వాడుకున్నట్లయితే పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్​ అమలు చేయవచ్చని పలువురు రిటైర్ట్​ పోలీసు అధికారులతో పాటు సర్వీసులో ఉన్న ఆఫీసర్లు చెప్తున్నారు. 

ట్రాఫిక్​ పోలీసుల పరిస్థితి మరీ  ఘోరం 

సివిల్​ పోలీసులతో పోలిస్తే ట్రాఫిక్ ​విభాగంలో పని చేసే పోలీసుల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. పెరిగిపోయిన వాహనాలకు తోడు ఇరుకు రోడ్లు, దుమ్ము, ధూళి నడుమ విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. కొన్ని చోట్ల డ్యూటీ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ నిలబడే ఉండాల్సిన దుస్థితి దాపురించింది. మధ్యలో కాస్త బ్రేక్​ తీసుకుందామన్నా వీలుండదు. రెండు నిమిషాలు రెస్ట్​ తీసుకుంటే ఎక్కడ ట్రాఫిక్​ నిలిచిపోయి ఉన్నతాధికారులతో తిట్లు తినాల్సి వస్తుందేమోననే భయంతో పని చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో నిలువ నీడ కూడా లేని చౌరస్తాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ట్రాఫిక్​ పోలీసులు కాలుష్యం బారిన పడి శ్వాస సంబంధ వ్యాధులతో సతమతమవుతున్నారు. 

పోలీసు మ్యానువల్​అమలయ్యేలా చూడాలి

పోలీసు మ్యానువల్​లో ఉన్న విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలి. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిం చాలంటే శారీరకంగా, మానసికంగా ఫిట్​గా ఉండాలి. దాని కోసం వారంలో ఒకరోజు సెలవు తప్పకుండా ఇవ్వాలి. అంతే కాకుండా డిపార్ట్​మెంట్​లో సరిపోయే విధంగా స్టాఫ్​ను పెంచాలి. సిబ్బందిని కూడా అనవసరమైన విధులకు ఉపయోగించొద్దు. 

 ‌‌– సుదర్శన్ గౌడ్, మాజీ డీసీపీ, పెద్దపల్లి -