వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో.. స్టయిఫెండరీ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికల కోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు, అధికారులు, సిబ్బంది వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో 250 మంది పనిచేస్తున్నారు. పురుషుల 1600 పరుగును పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రారంభించారు. నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చేసిన అభ్యర్థులకు ఎత్తు, బరువు, ఛాతి కొలతలు నిర్వహిస్తారు. తర్వాత లాంగ్‌జంప్, షాట్‌పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థుల ప్రతీ ఈవెంట్ కొలత రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కంప్యూటర్‌లో వెంటనే నమోదు చేయనున్నారు.
ఎంపికల కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు.. కొందరు అభ్యర్థులతో రెండు రోజుల ముందుగానే ట్రయల్స్ నిర్వహించారు. బయోమెట్రిక్, ఆర్ఎఫ్ఐడీ పరీక్షలు నిర్వహించారు. ఎంపికలకు ఉపయోగించే పరికరాలు సరిగా పని చేస్తున్నాయా? లేదా అని ముందుగానే పరీక్షించారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో ఎంపికల నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగిన కారణంగా... రెండేళ్లుగా పూర్తిగా సాంకేతిక పద్ధతిలో ఎంపికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోలీసుల ఎంపికలలో భాగంగా కేయూలో ఏఆర్, సివిల్, హోంగార్డ్సుతో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.