Physics wallah: బీటెక్ ఫెయిల్.. కానీ సొంత కంపెనీ పెట్టి రూ.వేల కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్..

Physics wallah: బీటెక్ ఫెయిల్.. కానీ సొంత కంపెనీ పెట్టి రూ.వేల కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్..

డిజిటల్ విప్లవం అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. విద్యావ్యవస్థలోనూ దాని పాత్ర చాలా కీలకంగా మారింది.టీచర్లు సంప్రదాయ తరగతి గదుల సరిహద్దులను దాటి.. యూట్యూబ్​ లాంటి వేదికల ద్వారా చదువు చెప్పడం మొదలుపెట్టారు. సరిగ్గా అదేటైంలో యూట్యూబ్​లోకి ట్యూటర్​గా ఎంట్రీ ఇచ్చాడు అలఖ్​ పాండే. ఫిజిక్స్ వాలా పేరుతో చానెల్​ పెట్టి లక్షల మంది స్టూడెంట్స్​కి చేరువయ్యాడు. ఆ సక్సెస్​తోనే కోట్ల విలువైన కంపెనీని స్థాపించాడు.

అలఖ్ పాండేది ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌. తండ్రి సతీష్ పాండే ప్రైవేట్ కాంట్రాక్టర్. తల్లి రజత్ పాండే విష్ణు భగవాన్ పబ్లిక్ స్కూల్‌‌‌‌లో టీచర్​గా పనిచేసేది. వాళ్లకు అక్టోబర్ 1991లో అలఖ్ పాండే పుట్టాడు. తన ప్రైమరీ ఎడ్యుకేషన్​ బిషప్ జాన్సన్ స్కూల్‌‌‌‌లో పూర్తి చేశాడు. తర్వాత ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్​ రాశాడు. కానీ.. ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దాంతో కాన్పూర్‌‌‌‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్​లో మెకానికల్ ఇంజనీరింగ్​లో చేరాడు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పాండేకు చిన్నప్పటి నుంచీ సైన్స్‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌ అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా ఫిజిక్స్​లో మంచి మార్కులు సాధించేవాడు. 

ట్యూషన్లు చెప్పి..:

పాండే చదువుకునే రోజుల్లో కొన్ని కారణాల వల్ల వాళ్ల ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో పాండే కూడా కుటుంబ బాధ్యతలను పంచుకున్నాడు. డబ్బు కోసం చిన్న వయస్సులోనే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. అలా అతను 11వ తరగతి చదువుతున్నప్పుడే నెలకు రూ. 5000 వరకూ సంపాదించేవాడు. అప్పుడు పాఠాలు చెప్పిన అనుభవమే పాండే యూట్యూబ్​ కెరీర్​కు దారి వేసింది. 

యూట్యూబ్​లోకి..:

పాండే 2014లో బీటెక్ నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడు చదువు మానేశాడు. ఆ తర్వాత ‘ఫిజిక్స్​ వాలా– అలఖ్​ పాండే’ పేరుతో యూట్యూబ్​ చానెల్​ పెట్టాడు. అందులో ముందుగా తనకు బాగా ఇష్టమైన ఫిజిక్స్​ పాఠాలు చెప్పాడు. చాలామంది స్టూడెండ్స్​ ఫిజిక్స్​ చదవడం అంటే భారంగా భావిస్తారు. అలాంటివాళ్లకు సులభంగా అర్థమయ్యేలా ఉచితంగా పాఠాలు చెప్పేందుకే చానెల్​ పెట్టాడు. కానీ.. పెద్దగా సక్సెస్​ రాలేదు. దాంతో లెక్చర్స్​ మరింత క్వాలిటీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మంచి స్టడీ మెటీరియల్స్​ని కొని, బాగా చదివి, వాటిలోని విషయాలపై లెక్చర్స్​ ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి వీడియోలకు వ్యూస్​ పెరిగాయి. క్రమంగా చానెల్​కు సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య పెరిగింది. అతను ఫిజిక్స్​ చెప్పే విధానం చాలామందికి నచ్చింది. చాలా తక్కువ టైంలోనే ఫేమస్‌‌‌‌ అయ్యాడు. 

యాప్ ప్రారంభం..:

అలఖ్ పాండే యూట్యూబ్​లో సక్సెస్​ కావడంతో 2018లో ఫిజిక్స్ వాలా పేరుతోనే మొబైల్​ యాప్‌‌‌‌ని తీసుకొచ్చాడు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతోంది. ఎందుకంటే.. యాప్‌‌‌‌లోని కంటెంట్​లో దాదాపు 90 శాతం ఉచితంగా ఇచ్చాడు. యాప్​ ద్వారా లైవ్​ క్లాస్​లు, నోట్స్​, వీడియో అసైన్‌‌‌‌మెంట్స్​, ఎగ్జామ్​ సిరీస్‌‌‌‌లు అందిస్తున్నాడు. అతనితోపాటు ఇప్పుడు చాలామంది లెక్చరర్స్​ ఫిజిక్స్​ వాలా కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా పాండే క్లాస్​లు  జేఈఈ, నీట్, యూపీఎస్​సీ ఎగ్జామ్స్​ రాసేవాళ్లకు బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఎగ్జామ్​ కోసం ప్రత్యేకంగా కోర్సులను డిజైన్​ చేశాడు. ప్రస్తుతం అతను నడుపుతున్న యూట్యూబ్​ చానెళ్లు, యాప్​ ద్వారా ప్రతి నెలా కోట్లలో  సంపాదిస్తున్నాడు. అతను ‘ఫిజిక్స్​ వాలా’ పేరుతో పెట్టిన కంపెనీ విలువ రూ. 15 వేల కోట్లపైనే ఉంటుందనేది ఒక అంచనా. 

ఫిజిక్స్ వాలా వెబ్ సిరీస్ :

పాండే సక్సెస్​ ఎంతోమందికి ఆదర్శం. అందుకే అతని గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పాండే లైఫ్​ స్టోరీతో ‘ఫిజిక్స్​ వాలా’ పేరుతో ఒక వెబ్​సిరీస్​ కూడా తీశారు. అది అమెజాన్ మినీటీవీలో అందుబాటులో ఉంది. ఇందులో యాక్టర్​ ‘శ్రీధర్ దూబే’ పాండే పాత్రలో నటించాడు. 

ఎన్నో భాషల్లో.. :

పాండే ఫిజిక్స్ వాలా చానెల్​ను 2014లో పెట్టినప్పటికి 2016 నుంచి కంటెంట్​ అప్​లోడ్​ చేస్తున్నాడు. అప్పట్లో సరైన ఎక్విప్​మెంట్​ లేకపోవడంతో మొదటి రెండు సంవత్సరాలు చేసిన వీడియోల క్వాలిటీ కూడా సరిగ్గా లేదు. అయినా స్టూడెంట్స్​ ఆ వీడియోలను విపరీతంగా చూసేవాళ్లు. ప్రస్తుతం చానెల్​లో 1,631 వీడియోలు ఉన్నాయి. చానెల్​ను 13.4 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. అటు కాంపిటేటివ్​, ఇటు అకడమిక్​ విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాస్​లు అందించాలని రకరకాల చానెళ్లను నడుపుతున్నాడు పాండే. ప్రస్తుతం ఫిజిక్స్​వాలా(పీడబ్యూ) నెట్​ వర్క్​ కింద 75కు పైగా చానెళ్లు ఉన్నాయి. అందరికీ క్వాలిటీ కంటెంట్​ని అందుబాటులోకి తీసుకురావాలని వివిధ భాషల్లో చానెళ్లను నడుపుతున్నాడు. వాటిలో పనిచేసేందుకు చాలామంది లెక్చరర్లను నియమించాడు. ఆ చానెళ్లలో కూడా కొన్నింటిని మిలియన్ కంటే ఎక్కువమంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు.