భద్రాద్రి కొత్తగూడెం : ఖమ్మం జిల్లా పినపాకలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. మణుగూరు మండలం తొగ్గుడెం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ ఒక్క ఫ్లెక్సీ, బ్యానర్లోనూ బీఆర్ఎస్ అనే పదం గానీ, ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ ఫోటో లేకపోవడంపై కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కనీసం ముఖ్యమంత్రి ఫొటో కూడా లేకుండా కార్యక్రమం నిర్వహించడం ఏంటని వారు గుసగుసలాడుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 3 వేల మంది హాజరుకానున్నారు. వారిని ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏం మాట్లాడతారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న పొంగులేటి త్వరలోనే పార్టీ మారనున్నారన్న ఊహాగానాల వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ అధినేత ఫొటో లేకుండా కార్యక్రమం నిర్వహించడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. పొంగులేటితో పాటు పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.