మందకృష్ణ.. 60 రోజులు నీ ఉద్యమాన్ని ఆపు

మందకృష్ణ.. 60 రోజులు నీ ఉద్యమాన్ని ఆపు
  •     సీఎం రేవంత్​రెడ్డి మాదిగల పక్షపాతి
  •     ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుంది
  •     ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

బషీర్ బాగ్, వెలుగు : సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు సీఎం రేవంత్​రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు. దండం పెట్టి అడుగుతున్నా మందకృష్ణ మాదిగ 60 రోజులు తన ఉద్యమాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడం, 60 రోజుల గడువుతో ఏకసభ్య కమిషన్ వేయడం హర్షించదగ్గ విషయమన్నారు. 

60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ పూర్తవుతుందని, రాష్ట్రంలోని మాదిగలు, మాదిగ సంఘాలు అప్పటివరకు సీఎం రేవంత్​రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతి అని, మాదిగల సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ ఊసే లేదని, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని పిడమర్తి రవి విమర్శించారు. రాష్ట్రంలోని మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 22 నుంచి 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ కుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.