మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి : పిడమర్తి రవి

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి : పిడమర్తి రవి
  • ఎస్సీ వర్గీకరణపై జిల్లాలను యూనిట్ గా తీసుకోవాలి
  • మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి

ములుగు, వెలుగు :  రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీవర్గీకరణపై జిల్లాలను యూనిట్ గా తీసుకోవాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి డిమాండ్ చేశారు. మాదిగల మేలు కొలుపు యాత్ర ములుగు జిల్లాకు చేరుకోగా మంగళవారం మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

అనంతరం పిడమర్తి రవి.. ముందుగా అంబేద్కర్​విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూనే.. ఎవరి కులం జనాభా ఎంత ఉంటే అంత వాటా దక్కాలని రాష్ట్రవ్యాప్తంగా మాదిగల చైతన్యానికి యాత్రను చేపట్టినట్టు పేర్కొన్నారు.

త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలను యూనిట్ గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని విన్నవిస్తామని చెప్పారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఇంకా ఎంతో వెనకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాత్రలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు, టీఎండీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల్లి మల్లికార్జున్, ఎంహెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేశ్  ​తదితరులుపాల్గొన్నారు.