ప్రపంచంలోనే మొదటిసారి.. మనిషికి పంది కాలేయం

ప్రపంచంలోనే మొదటిసారి.. మనిషికి పంది కాలేయం
  • విజయవంతంగా  ట్రాన్స్ ప్లాంట్ చేసిన చైనా డాక్టర్లు
  • జన్యుపరంగా మార్పులు చేసి సర్జరీ
  • ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి 

బీజింగ్: ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది లివర్‎ను ట్రాన్స్ ప్లాంట్ చేశారు. జన్యుపరంగా మాడిఫై చేసిన పంది కాలేయాన్ని బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి డాక్టర్లు విజయవంతంగా అమర్చారు. అది పది రోజుల పాటు బాగా పని చేసింది కూడా. నిరుడు  చైనాలోని షీజింగ్ హాస్పిటల్‎లో ఈ సర్జరీ జరగగా, ఈ రీసెర్చ్ వివరాలు ఇటీవల నేచర్ జర్నల్‎లో పబ్లిష్ అయ్యాయి. 

లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి లేదా పేషెంట్ లివర్ తిరిగి జనరేట్ అయ్యేలోపు లివర్ ఫంక్షన్‎ను సపోర్టు చేయడానికి పంది కాలేయం ఒక బ్రిడ్జింగ్ అవయవంలా పని చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘పంది కాలేయం మనిషి శరీరంలో బాగా పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి మేం ప్రయత్నించాం. మనిషి ఒరిజినల్ కాలేయానికి ఇది ప్రత్యామ్నాయం అవుతుందో లేదో అని పరీక్షించాం. 2022 నుంచి పంది అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు.

అమెరికా, చైనాలో సర్జన్లు ఇదివరకే పంది కిడ్నీలు, గుండె, థైమస్ గ్లాండ్‏ను పేషెంట్లకు మార్పిడి  చేశారు. కానీ, పంది లివర్‎ను మనిషికి అమర్చడం ఇదే ఫస్ట్ టైం. ఓ యాక్సిడెంట్‎లో తలకు బలమైన గాయం కావడంతో ఆ వ్యక్తి (50)  బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనికి పంది లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశాం. పేషంట్ లివర్‏ను అలాగే ఉంచి పది గంటలపాటు సర్జరీ చేసి పంది లివర్ అమర్చాం” అని ప్రొఫెసర్  లిన్ వాంగ్  తెలిపారు. ఆయన నేతృత్వంలోనే ఈ సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత పంది లివర్  పైత్యరసాన్ని కూడా ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. 

పది రోజులు ఉంచి తీసేశారు.. 

పేషంట్‎కు అమర్చిన పంది లివర్‎ను పది రోజులు ఉంచారు. తర్వాత అతని కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు తీసేశామని వాంగ్  తెలిపారు. ‘‘రోగిలో పంది కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేసింది. అయితే, ఆ పైత్య రసం పంది లివర్ వల్ల ఉత్పత్తి అయిందా, లేదా అతని లివర్ వల్ల అయిందా అనేది తెలియలేదు” అని వాంగ్ చెప్పారు.  

ఏంటీ జన్యుపరంగా మాడిఫై చేసిన లివర్..?

బామా అనే ఏడు నెలల పందిని సైంటిస్టులు జన్యుపరంగా మాడిఫై చేశారు. ఆ పంది లివర్‎ను రోగిలో అమర్చారు. మనిషి శరీరానికి తగ్గట్లు విధులు నిర్వర్తించేలా ఆ పందికి శాస్త్రవేత్తలు జన్యపరమైన మార్పులు చేశారు.