![కంది రైతుకు కష్టకాలం .. ధర లేక ఇండ్లలో పంట నిల్వలు](https://static.v6velugu.com/uploads/2025/02/pigeon-pea-cultivation-farmers-are-facing-difficulties-this-year_7JG5fM4p03.jpg)
- పరిమితంగా ఎకరానికి 3.31 క్వింటాళ్లే కొనుగోళ్లు
- 6 క్వింటాళ్లకు పెంచాలని రైతుల డిమాండ్
- ప్రభుత్వానికి నివేదిక.. ఆదేశాల కోసం ఎదురుచూపులు
- జిల్లా వ్యాప్తంగా 57 వేల ఎకరాల్లో కంది సాగు
ఆదిలాబాద్, వెలుగు : కంది రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 57 వేల ఎకరాల్లో కంది పంట సాగు చేయగా 3.30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా కంది రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లు చేపట్టారు. ఆశించిన స్థాయిలో పంట చేతికొచ్చినా.. అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొనుగోళ్లలో పరిమితులు విధించి ఎకరానికి 3 క్వింటాళ్ల 31 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొదట ఐదు సెంటర్లే..
గతేడాది 61,246 ఎకరాల్లో కంది పంట సాగుచేయగా 3.67 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. గతేడాదితో పోలిస్తే సంవత్సరం స్వల్పంగా సాగు, దిగుబడులు తగ్గాయి. గతేడాది 8 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టిన అధికారులు ఈ ఏడాది కేవలం 5 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. ఆదిలాబాద్, జైనథ్, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్‌లో కొనుగోళ్లు చేపడుతున్నారు.
దీంతో ఆ ప్రాంతాల్లోకి పంటను తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుదున్న ఇచ్చోడ, బేల, తాంసి, నేరడిగొండ, బేల మండలాల రైతులు తమ ప్రాంతంలోనూ కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అప్రమత్తమైన అధికారులు మరిన్ని కేంద్రాల్లో పంట కొనుగోలు చేస్తామని వెల్లడించారు. మంగళవారం నుంచి మిగతా సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు మార్క్ ఫెడ్ డీఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.
పరిమితితో పరేషాన్
జిల్లాలో ఈ ఏడాది 57,258 ఎకరాల్లో పంట సాగు చేసిన రైతులు చేతికొచ్చి విక్రయించే సమయానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాధారణంగా కంది పంట ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్క్ ఫెడ్ మాత్రం నిబంధనల ప్రకారం ఎకరానికి 3.31 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుండటంతో మిగతా పంటను అమ్ముకునేందుకు రైతులకు అవస్థలు తప్పడం లేదు. గతంలోనే అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎకరానికి 6 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక సైతం పంపించారు.
కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఎకరానికి 3.31 క్వింటాళ్లు మాత్రమే కొంటున్నారు. ఈ నిబంధనలపై అవగాహన లేని రైతులు మొత్తం పంటను మార్కెట్లోకి తీసుకొస్తుండగా.. అధికారులు కొనకపోవడంతో దిక్కు తోచని స్థితిలో వెనక్కి తీసుకెళ్తున్నారు.
అమాంతం పడిపోయిన ధర
కంది పంటకు ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ.7550 మద్దతు ధరతో విక్రయిస్తుండగా ప్రైవేట్ లో రూ.6,500 వేలు కూడా రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు ధర పెరుగుతుందనే ఉద్దేశంతో పంటను ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నారు. నెల రోజుల క్రితం ప్రైవేట్‌లో రూ.9500 పలికిన ధర.. పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చి విక్రయించే సమయానికి అమాంతం తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది తమ పంటను ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ధర పెరిగితే అమ్ముకుందామని ఆశతో చూస్తున్నారు.
మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలి
నేను ఈసారి ఐదు ఎకరాల్లో కంది పంట వేసిన. 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఇక్కడ ఎకరానికి 3.31 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామని చెబుతున్నారు. మరి మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలి. ప్రభుత్వం పరిమితులు తొలగించి మొత్తం పంటను కొనాలి.
భువనగిరి నారాయణ, రైతు, కజ్జర్ల
జిల్లాలో కంది సాగు వివరాలు సాగు విస్తీర్ణం 57 వేల ఎకరాలు
రైతులు 68 వేలు
దిగుబడి అంచనా 3.43 లక్షల క్వింటాళ్లు
మద్దతు ధర రూ.7,550 క్వింటాలుకు
ప్రైవేట్ ధర రూ. 6,500 వేలు