![మెట్రో 4వ కారిడార్ పనులు ఆపండి: హైకోర్టులో పిల్ దాఖలు](https://static.v6velugu.com/uploads/2025/02/pil-against-hyderabad-metro-expansion-to-old-city-in-telangana-hc_Sn8psIqDLX.jpg)
- మెట్రో విస్తరణపై హైకోర్టులో పిల్:
- చారిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందన్న పిటిషనర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో విస్తరణ పనులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు 4వ కారిడార్ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన మెట్రో విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.
మెట్రో విస్త్రరణ పనుల వల్ల చారిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందని మహమ్మద్ రహీంఖాన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. చార్మినార్, ఫలక్‌నుమా, పురాణాహవేలి, దారుల్‌షిఫా, అజాఖాన్‌ఆయేజెహ్ర, ఇమా మసీద్, మొగల్‌పురా టూంబ్స్ తదితర కట్టడాలకు ప్రమాదం వాటిల్లుతుందన్నారు. చారిత్రక కట్టడాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా రెండో దశ విస్తరణ పనులను చేపట్టారని, వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడం రాజ్యాంగ, చారిత్రక కట్టడాల చట్టం-2017కు విరుద్ధమన్నారు.
నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించాలని కోరారు. అంతేకాకుండా పురావస్తు శాఖ, పర్యావరణ, సామాజిక నిపుణులతో స్వతంత్ర వారసత్వ పరిరక్షణ అథారిటీ లేదా కమిటీతో అధ్యయనం చేయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, భూసేకరణ అధికారి, మెట్రో ఎండీ, వక్ఫ్‌బోర్డు సీఈఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.