మెట్రోలో బెట్టింగ్ యాడ్స్​పై హైకోర్టులో పిల్

 మెట్రోలో బెట్టింగ్ యాడ్స్​పై హైకోర్టులో పిల్
  • అగ్రిమెంట్​ రద్దుతోపాటు దర్యాప్తు చేయాలన్న పిటిషనర్

హైదరాబాద్, వెలుగు: మెట్రో రైల్​లో బెట్టింగ్‌‌ యాడ్స్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌‌ దాఖలైంది. బెట్టింగ్‌‌ యాప్‌‌లతో హైదరాబాద్‌‌ మెట్రో రైల్​ కుదుర్చుకున్న ఒప్పందాలపై దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది ఎన్‌‌.నాగూర్‌‌బాబు హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు. మెట్రో రైలులో, ఫ్లాట్‌‌ఫారాలు, స్టేషన్ ఆవరణలలో బెట్టింగ్‌‌ యాప్‌‌లపై ప్రకటనలను తక్షణం నిలిపివేసేలా ఆదేశించాలని కోరారు. మెట్రో రైల్వేకు, బెట్టింగ్‌‌ యాప్‌‌ సంస్థలకు మధ్య కుదిరిన లావాదేవీలపై దర్యాప్తు చేపట్టేలా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌కు ఆదేశాలు జారీ చేయాలన్నారు. 

బెట్టింగ్‌‌ యాప్‌‌లపై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి, రూ.399 కోట్లు జప్తు చేసిన నేపథ్యంలో ఈ ఒప్పందాలపై విచారణ జరపాలన్నారు.  ప్రకటనల విధానంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. ఈ ప్రకటనలకు బాధ్యులైన ఉన్నతాధికారుల నుంచి పరిహారం రాబట్టి ప్రజాసంక్షేమ నిధికి చెల్లించాలన్నారు. ఇందులో ప్రతివాదులుగా మెట్రోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, సీఎస్,. జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌లతోపాటు వారిని వ్యక్తిగత హోదాలోను చేర్చారు. ఈ పిటిషన్‌‌ నెంబరు కేటాయింపు నిమిత్తం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.