జూబ్లీహిల్స్‌‌లో బ్లాస్టింగ్​తో కొండరాళ్ల తొలగింపుపై పిల్‌‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌‌ నివాస ప్రాంతంలోని కొండ రాళ్ల తొలగింపునకు డే అండ్‌‌ నైట్‌‌ పేలుళ్లను నిర్వహించడంపై పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. పత్రికలో వచ్చిన వార్తను చదివిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ నగేష్‌‌ భీమపాక చీఫ్‌‌ జస్టిస్‌‌కు లేఖ రాశారు. రోజుకు 10కి తగ్గకుండా పేలుళ్లు నిర్వహిస్తున్నారని, తొలగించిన రాళ్లను రాత్రిపూట రవాణా చేస్తున్నారని  లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల సమీపంలోని న్యాయవిహార్, భరణి లేఔట్, రామానాయుడు స్టుడియో పరిసరాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

ఈ శబ్ధాలతో రాత్రిపూట ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పత్రికా కథనం ఆధారంగా న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌‌గా తీసుకుంది. భూగర్భ గనుల శాఖ, పర్యావరణ మంత్రిత్వశాఖ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ డైరెక్టర్, హైదరాబాద్‌‌ కలెక్టర్, జీహెచ్‌‌ఎంసీలను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.