- హైకోర్టులో పిల్ వేసిన హిందూ మహాసభ
- ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: డిండి ప్రాజెక్టులో భాగమైన శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో ఇసుక పేరుతో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అక్రమాలపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీల డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర్లోని వాగుల నుంచే కాకుండా ప్రైవేట్ ఏరియాల నుంచి ఇసుక సేకరించినట్లుగా చెప్పి రూ.274 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కోర్టుకు చెప్పారు. దీనిపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు.. పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది. పిల్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా చేసింది.