యాత్రికుల బస్సు దగ్ధం .. భైంసా వాసి మృతి

యాత్రికుల బస్సు దగ్ధం .. భైంసా వాసి మృతి
  • ఉత్తరప్రదేశ్‌‌లో ప్రమాదం

భైంసా, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా నుంచి వెళ్లిన యాత్రికుల బస్సు ఉత్తరప్రదేశ్‌‌లో ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో భైంసాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్‌‌ జిల్లా భైంసాకు చెందిన 54 మంది సమైకర్‌‌ భగవాన్‌‌ ఆధ్వర్యంలో ఈ నెల 1న పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లారు. రామేశ్వరం, కన్యాకుమారితో పాటు ప్రముఖ క్షేత్రాలను దర్శించుకొని కాశీకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌‌లోని వృంధావన్‌‌ రాధాకృష్ణ మందిరానికి చేరుకున్నారు. 

బస్సును పార్క్‌‌ చేసిన అనంతరం డ్రైవర్లతో పాటు యాత్రికులంతా కిందకు దిగగా, కుభీర్‌‌ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దత్తాత్రి (65) అనారోగ్యం కారణంగా బస్సులోనే ఉండిపోయాడు. ఆ టైంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం అంటుకుంది. గమనించిన స్థానికులు ఫైర్‌‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే దత్తాత్రి చనిపోయాడు. ప్రమాదంలో యాత్రికులకు సంబంధించిన బట్టలు, డబ్బులు మొత్తం కాలిబూడిద అయ్యాయి. 

దీంతో అక్కడి ఆఫీసర్లు వృందావన్‌‌ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో వసతి కల్పించారు. ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ లీడర్లు బాధితుల వద్దకు చేరుకొని దుప్పట్లు, భోజనం ఏర్పాటు చేశారు. మృతుడి అంత్యక్రియలను అక్కడే నిర్వహించినట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న ముథోల్‌‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌‌ మంగళవారం రాత్రి కేంద్రమంత్రులు కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌లతో మాట్లాడి బాధితులను రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే అక్కడి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి యాత్రికులను రోడ్డు మార్గంలో భైంసాకు తీసుకువస్తున్నారు.