కార్తీక మాసంలో పండరీపుర్ యాత్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పండరీపుర్ కు భక్తుల పాదయాత్ర ప్రారంభమైంది. ఏటా కార్తీక మాసంలో భక్తులు ఈ యాత్రను చేపడతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు పండరీపుర్ లోని విఠలేశ్వరుని ఆలయానికి పాదయాత్రగా వెళతారు. తలపై తులసి చెట్టు పెట్టుకుని పాదయాత్ర చేస్తారు.
పండరీపుర్ యాత్రలో భాగంగా ముందుగా చంద్రభాగా నదిలో పుణ్యస్నానాలు చేసి అనంతరం విఠలేశ్వరుని దర్శించుకుంటారు. దర్శనం సందర్భంగా మూల విరాట్ ను తాకనిచ్చే ఏకైక ఆలయం పండరీ పుర్. భక్తులు మూట విరాట్ పాదాలపై పడి మొక్కుకునే అవకాశం కల్పిస్తారు. స్వామి వారిని తాకడం తమ అదృష్టమని.. తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పండరీపుర్ కు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రతి ఒక్కరికీ దర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతుంది. పండరీపుర్ వచ్చిన వారు ఎంత సమయమైనా ఓపిగ్గా వేచి ఉండి దర్శనం చేసుకుంటారు.
పండరీ పుర్ యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, నాందేడ్ నుంచి ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 21 సంవత్సరాల నుంచి పండరీ పుర్ యాత్ర చేస్తున్నామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్థన్ రాథోడ్ తెలిపారు. చాలా మంది దాతలు, భక్తులు యాత్ర సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారని చెప్పారు. దాతలు స్వచ్ఛందంగా అన్నదానం, తాగునీటి వసతి, రవాణా.. సౌకర్యాలు కల్పిస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా విఠలేశ్వరస్వామి పాదాలపై పడి మొక్కులు తీర్చుకునే అవకాశం తమ అదృష్టంగా భావిస్తామని అన్నారు.