![ధర్మదర్శనానికి 4 గంటలు.. ఉక్కపోతతో జనం అవస్థలు](https://static.v6velugu.com/uploads/2022/06/pilgrims-facing-problems-at-yadagiri-gutta-temple_89t20hGKTN.jpg)
యాదగిరిగుట్ట, వెలుగు: ఆదివారం వచ్చిందంటే చాలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఎండలు మండుతుండడం, కొండపైన సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆదివారం సైతం హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. నరసింహుడి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం పట్టింది. వీఐపీల తాకిడి ఎక్కువవడంతో భక్తులను క్యూలైన్లలో నిలిపివేశారు. అసలే రద్దీ ఎక్కువగా ఉండడంతో తోపులాట జరిగింది. తాండూరుకు చెందిన శశివర్ధన్ అనే భక్తుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతడిని కొండపైన హాస్పిటల్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఎనర్జీ డ్రింక్స్ అందించారు.
స్వామి సేవలో ప్రముఖులు
యాదగిరిగుట్టలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సురేందర్, ఏపీలోని రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లా సెక్రటరీ నందికొండ నర్సింగరావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర కన్జ్సూమర్డిస్పూట్స్ రీఅడ్రస్సెల్ కమిషన్ ప్రెసిడెంట్ జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ ఆదివారం వేర్వేరుగా ఫ్యామిలీతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆఫీసర్లు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు వారికి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు.
అరకొరగా బస్సులు
భక్తుల రాక విపరీతంగా పెరగడం, అందుకనుగుణంగా కొండపైకి ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లేటపుడు, తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కే సమయంలో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ కు చెందిన వేర్వేరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా నెట్టేశారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్పీఎఫ్ పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని సముదాయించి వేర్వేరు బస్సులలో పంపించారు. సరిపడా బస్సు సర్వీసులు నడపకపోవడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజే 50.89 లక్షల ఆదాయం
భక్తులు భారీగా తరలిరావడంతో ఆదివారం ఒక్కరోజే దేవస్థానానికి రూ.50,89,482 ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలో ఒక్కరోజులో వచ్చిన అత్యధిక ఆదాయం ఇదేనని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.18,27,900 సమకూరింది. వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.6.90 లక్షలు, కొండపైకి వచ్చే కార్ల ప్రవేశ రుసుముతో రూ.4.50 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.4,77,700, సువర్ణ పుష్పార్చన పూజల ద్వారా రూ.1,66,800, సత్యనారాయణస్వామి వ్రత పూజలతో రూ.2 లక్షల ఇన్ కం వచ్చింది.